Hyderabad Real Estate : ఓ వైపు హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరం నలువైపులా రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. నివాస సముదాయాల భవనాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పక్క ఊర్ల నుంచి వచ్చిన వారు హైదరాబాద్ నగరంలో సొంతిళ్లు కొనుక్కోవాలని కలను సాకారం చేసుకుంటున్నారు. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ భూమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కు ఎక్కడ డిమాండ్ ఉంది. ఏ ఏరియాలో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికర అంశాలుగా మారుతాయి.
తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం.. నార్త్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నా పెట్టుబడిదారులు అటువైపే మొగ్గు చూపుతున్నారు.దీంతో ఆ ఏరియాల్లో రియాల్టీకి పుల్లు డిమాండ్ ఏర్పడింది. ఉత్తర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తో ఇన్వెస్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారి రియాల్టీదారులకు లాభాల పంటను పండిస్తోంది. పెట్టుబడి దారులకు ప్రముఖ గమ్యస్థానంగా అది మారుతోంది.

ఉత్తర హైదరాబాద్ విషయానికి వస్తే.. మెడ్చల్, కల్లకల్, తూప్రాన్ వరకు రియాల్టీ రంగం విస్తరించింది. అంతకు ముందు రియాల్టీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైరదాబాద్ సవాల్ విసురుతోంది. భాగ్య నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏరియాలో రహదారి విస్తరణతో పాటుగా ఫ్లైఓవర్‌లు, ORR, NH-44 లతో అనుసంధానం వంటి మౌళిక సదుపాయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ పెట్టుబడి దారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
ఉత్తర హైదరాబాద్ లోని కల్లకల్, తూప్రాన్ వంటి ప్రాంతాల్లో గతంలో గజం రూ. 1500 పలకగా ఇప్పుడు అదే గజం రూ. 20 వేల వరకు పెరిగింది. మూడు, నాలుగేళ్ల కిందట గజం రూ. 1500 పెట్టి కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు అంతకు నాలుగింతలు లాభాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. కండ్లకోయలో నిర్మాణంలో ఉన్న గేట్వే ఐటీ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ పార్క్ టెక్ కేంద్రంగా మారడంతో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక కొంపల్లిలోని ఐటీ పార్క్, మేడ్చల్‌లోని జీనోమ్ వ్యాలీ 3.0 విస్తరణ కూడా అటు ఫార్మా ఇటు బయోటెక్ రంగాల పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
మేడ్చల్-కండ్లకోయ ఇండస్ట్రియల్ బెల్ట్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండస్ట్రీ, గిడ్డంగులు, లైట్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు అక్కడికి తరలివస్తున్నాయి. తక్కువ ధరలలో ఎక్కువ స్థలం లభిస్తుండటంతో అదరూ అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో డెవలపర్లు కూడా ఆ ప్రాంతంలో పచ్చదనంపై ఫోకస్ పెడుతున్నారు. పెద్ద స్థాయి పెట్టుబడిదారులతో పాటు సాధారణ కొనుగోలుదారులు కూడా అక్కడ ఇళ్లు, లేదా స్థలం కొనుగోలు చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. రాబోయే 3-5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో భూమి విలువల ఏకంగా నాలుగు రెట్లు పెరిగే అవకాశముందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications