Realty Stocks: ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఈరోజు రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి సమావేశంలో రెపో రేటును మళ్లీ పెంచుతున్నట్లు ప్రకటించటంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ దెబ్బతింది. అసలే ఖర్చులు పెరిగి సతమతమౌతున్న వారిపై వడ్డీల భారం మోయలేనిది మారుతుందని చాలా మంది భావిస్తున్నారు.

మార్కెట్ రియాక్షన్..
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటనపై మార్కెట్ రియాక్ట్ అయ్యింది. దీంతో రియల్టీ స్టాక్స్ పతనం కొనసాగింది. ఫీనిక్స్ మిల్స్ స్టాక్ అత్యధికంగా 5 శాతం మేర నష్టపోయింది. ఈ క్రమంలో సన్‌టెక్ రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, ఒబెరాయ్ రియల్టీ స్టాక్స్ కూడా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ సైతం క్షీణించింది. దీనిని బట్టి పెంపుపై మార్కెట్ ఏమాత్రం సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది.

ప్రభావం ఇలా..
గృహ రుణాలు రెపో రేటుకు అనుసంధానించినందున సెంట్రల్ బ్యాంక్ చేసే మార్పులతో వడ్డీ రేటు పెరగటం లేదా తగ్గటం జరుగుతుంది. అయితే విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు రేట్ల పెంపు కొనసాగటంతో రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు రుణ ఖర్చులు భారీగా పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గకపోవటంతో ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారిపై భారం మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి.

వారిపై ప్రభావం తక్కువ..
ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ తీసుకున్న చర్యలు మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారంగా కనిపిస్తోంది. అయితే లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విషయంలో రేట్ల పెంపు ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. 2022 మే నుంచి ఎంపీసీ సమావేశాల్లో రేట్ల పెంపును కొనసాగిస్తున్నప్పటికీ లగ్జరీ రియల్టీ విషయంలో ప్రభావం కనిష్ఠంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ధనవంతులు ఇష్టపడే ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు కాబట్టి వారు ఈ ప్రభావిత కేటగిరీ కిందకు రారని నిపుణులు చెబుతున్నారు.

గోవా కంపెనీ..
ప్రస్తుత రేటు పెంపు పెద్ద ప్రభావాన్ని చూపదని గోవాలో లగ్జరీ ఇళ్లను నిర్మించే బెన్నెట్ అండ్ బెర్నార్డ్ కంపెనీ ఛైర్మన్ & వ్యవస్థాపకుడు లింకన్ బెన్నెట్ రోడ్రిగ్స్ తెలిపారు. గత రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. లగ్జరీ రియల్ ఎస్టేట్ అనేది ఎన్నారైలు, హెచ్‌ఎన్‌ఐలు, ఉబెర్ సంపన్నులకు ప్రాధాన్య ఎంపికగా ఉందని వెల్లడైంది. వారు విలాసవంతమైన గృహాలను కొనుగోలు చేయడానికి గతంలో కంటే ఎక్కువ ఇష్టపడుతున్నటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications