కరోనా మహమ్మారి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతిన్నది. రియల్ రంగంతో పాటు అనుబంధంగా ఉండే 250కి పైగా రంగాలపై ప్రభావం పడిందని KPMG సర్వే వెల్లడించింది. కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు 6-12 నెలల పాటు ఈ రంగంలో స్తబ్దత నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు సహకరిస్తే రియల్ ఎస్టేట్ రంగం సాధారణ స్థితికి రావడానికి 18 నెలల నుండి 24 నెలల సమయం పడుతుందని కేపీఎంజీ అంచనా వేసింది.

కరోనా దెబ్బకు రియాల్టీలో మార్పుల 'భారం'
లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు పాటించడం, కొత్త సాంకేతికతలు అందుకునేందుకు సమయం, దీనికి అదనపు లేదా అధిక ఖర్చు చేయాల్సి రావడం, వ్యాపార పద్ధతులు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. దీర్ఘకాలంలో చూస్తే డేటా కేంద్రాలు, గోదాములు, సరఫరా కేంద్రాలు, పారిశ్రామిక పార్కుల వంటి వాటిలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

వీటి వల్ల రియల్ రంగంపై ప్రభావం
కరోనా కారణంగా రియల్ రంగం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకోట్ల నష్టాన్ని చవిచూసే అవకాశముందని కేపీఎంజీ అంచనా వేసింది. రానున్న 6 నుండి 12 నెలల్లో రియల్ కార్యకలాపాలు మందగించవచ్చునని, ఆ తర్వాత పుంజుకోవచ్చునని పేర్కొంది. ఉద్యోగ భద్రత అనిశ్చితి, ఉద్యోగాల కోత, శాలరీ కట్, లిక్విడిటీ సమస్య ఇళ్ల అమ్మకాల క్షీణతకు దారి తీయవచ్చునని ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు 2.8-3 లక్షల యూనిట్లకు తగ్గవచ్చునని అంచనా వేసింది.

రియల్ వ్యాపారుల లాభాల్లో 20 శాతం కోత
2019-20లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా సహా ఏడు నగరాల్లో దాదాపు 4 లక్షల ఇళ్లు విక్రయించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2.8 లక్షల నుండి 3 లక్షలకు పడిపోతుందని అంచనా వేసింది. అందుబాటు ధరల ఇళ్లు, మధ్య తరగతి ఎక్కువగా కొనుగోలు చేసే ఇళ్లు ఇప్పటికిప్పుడు అమ్ముడుపోవడం కష్టమే అంటున్నారు. 2020 ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడవచ్చు. ముడి సరుకుల ధరలు పెరగడం, కొనుగోళ్ల వాయిదా వంటి కారణాలతో డెవలపర్ల లాభాలు 10 శాతం నుండి 20 శాతం వరకు తగ్గవచ్చు.


Click it and Unblock the Notifications