దేశంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో రియాల్టీ రంగం.. 6 నెలల్లో రూ.3.6 లక్షల కోట్లు అమ్మకాలు
దేశంలో రియాల్టీ రంగం అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పుంజుకుంటోంది. టైర్ 1 నగరాల్లో అమ్మకాలు భారీగా వృధ్దిని నమోదు చేస్తున్నాయి. CREDAI, CRE మ్యాట్రిక్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 2025 మొదటి అర్ధభాగంలో (H1 CY25) భారీ స్థాయికి చేరాయని తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం.. టియర్-1 నగరాల్లో గృహ విక్రయాల మొత్తం విలువ రూ. 3.6 లక్షల కోట్లకు చేరింది. ఇది గత సంవత్సరం అదే కాలంలో నమోదైన రూ. 3.3 లక్షల కోట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధిను సూచిస్తోంది.
ఈ వృద్ధికి ప్రధానంగా ప్రీమియం మరియు లగ్జరీ విభాగాల్లో పెరిగిన డిమాండ్ కారణంగా చెప్పుకోవచ్చు. రూ.1 కోటి కంటే ఎక్కువ ధర గల ఇళ్ల అమ్మకాలు మొత్తం మార్కెట్‌లో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జాతీయ రాజధాని ప్రాంతం (NCR)ఈ ఏడాది మొత్తం అమ్మకాలలో 26 శాతం ఆదాయ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. సగటు టిక్కెట్ పరిమాణంలో 32 శాతం పెరుగుదల ఉండగా, రూ.3 కోట్లకు పైగా లగ్జరీ ఇళ్లే మొత్తం విక్రయాల విలువలో 73 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇది ప్రీమియం గృహాలపై కొనుగోలుదారుల పెట్టుబడిదారుల మొగ్గును స్పష్టంగా సూచిస్తోంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) 23 శాతం ఆదాయ వాటాతో NCR దరిదాపుల్లోకి వచ్చింది. ఇక్కడ 75,000 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సగటు టిక్కెట్ పరిమాణం 16 శాతం పెరిగింది. రూ.3.5 కోట్ల కంటే ఎక్కువ ధర గల ఇళ్ల వాటా 29 శాతం నుంచి 34 శాతంకి పెరగడం అల్ట్రా-ప్రీమియం హౌసింగ్ వైపు మారుతున్న ధోరణిని కనబరుస్తోంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమ్మకాల విలువ స్వల్పంగా 2 శాతం పెరిగినప్పటికీ, అమ్మకాలు 11 శాతం తగ్గాయి. ఐటీ రాజధాని బెంగళూరులో మాత్రం స్థిరమైన వృద్ధి కనిపించింది. మొత్తం ఈ ఏడాది 30 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్ పరిమాణం 17 శాతం పెరిగింది.
పూణేలో అమ్మకాలు తగ్గినా..అహ్మదాబాద్, చెన్నైలతో పాటుగా వృద్ధి నగరంగా గుర్తించబడింది. చెన్నై కొత్త లాంచ్‌ల్లో 14 వేల నుంచి 19 వేల యూనిట్లకు పెరుగుదల నమోదు చేయగా, అహ్మదాబాద్‌లో రూ.70 లక్షల లోపు ఇళ్ల వాటా 27 శాతం నుంచి 29 శాతంకి పెరిగింది. పెరుగుతున్న ఆదాయాలు, అభిరుచులు.. ఇవన్నీ కలిపి వినియోగదారులను పెద్ద, మంచి లోకేషన్ గల, లగ్జరీ గృహాల వైపు ఆకర్షిస్తున్నాయని CREDAI అధ్యక్షుడు శేఖర్ పటేల్ అన్నారు. ఇప్పుడు పరిమాణం కన్నా నాణ్యత, ప్రీమియం ఫీచర్లు ముఖ్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
CRE మ్యాట్రిక్స్ CEO అభిషేక్ గుప్తా మాట్లాడుతూ..రూ.3.6 లక్షల కోట్ల ఆదాయం అంటే ఇప్పటివరకు నమోదైన గరిష్ఠం. ఇది మన మార్కెట్‌లో ఉన్న ఉత్సాహాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. ఆరైజ్ గ్రూప్ MD అమన్ శర్మ ప్రకారం..NCRలో విభిన్నమైన, నాణ్యమైన గృహాలకు డిమాండ్ పెరుగుతోందంటే, ఇది డెవలపర్‌లకు కొత్త అవకాశాలుగా మారుతోందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications