Ayodhya Realty: ఆధ్యాత్మికను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ రియల్టీ కంపెనీలు రామ మందిరం నిర్మాణంలో ఉన్న అయోధ్యకు చేరాయి. మోదీ సర్కార్ శరవేగంగా ఆలయ నిర్మాణాలతో పాటు వీరు తమ ప్రాజెక్టులను లాంచ్ చేస్తున్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వేగంగా పెరుగుతోంది. చాలా మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు అయోధ్యలోని ఆస్తులపై పెద్ద మెుత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా(HOABL) దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టి 25 ఎకరాలు కొనుగోలు చేసింది.

జనవరి 2024లో లోధా గ్రూప్ ఒక ప్లాట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సముజ్వల్ ఘోష్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ అయోధ్యలోని రామాలయానికి 12 నుంచి 15 నిమిషాల దూరంలో ఉందని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో రూ.1,200 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని చూస్తోంది. కంపెనీ ప్రస్తుతం కొన్న స్థలానికి అవసరమైన నిర్మాణ అనుమతులను పొందే ప్రక్రియలో ఉంది. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత అయోధ్యలో 200-250 ప్లాట్లను విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.
ఈ క్రమంలో 1250 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ.1.80 కోట్ల కంటే ఎక్కువగా ఉండొచ్చని సముజ్వల్ ఘోష్ వెల్లడించారు. దీనితో పాటు రిటైల్, హాస్పిటాలిటీ వంటి వ్యాపారాల్లోకి ప్రవేశించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లక్నో-గోరఖ్‌పూర్ హైవేపై ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామమందిరం నుంచి ఇక్కడికి ప్రయాణ సమయం కేవలం 12-15 నిమిషాలు మాత్రమేనని తెలుస్తోంది. అలాగే విమానాశ్రయానికి ప్రయాణ సమయం 20 నిమిషాలేనని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో కంపెనీ రాష్ట్రంలో సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడి గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications