ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి, ఆరో ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షను నేటి నుంచి (ఫిబ్రవరి 4) మూడ్రోజుల పాటు నిర్వహిస్తారు. 6వ తేదీన సమీక్ష నిర్ణయాలు వెల్లడిస్తారు. 2020-21 బడ్జెట్ అనంతరం జరుగుతున్న ఈ సమీక్షలో రేట్ల కోతకు పెద్దగా అవకాశాలు ఉండవని భావిస్తున్నారు.

అందుకే వడ్డీ రేట్ల కోతకు మొగ్గు చూపకపోవచ్చు
గత ఏడాది డిసెంబర్ నెలలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్భణం అయిదేళ్ల గరిష్టం 7.3 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతకు ఆర్బీఐ మొగ్గు చూపే అవకాశాలు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. 2019లో ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్ల మేర కీలక రేట్లను తగ్గించింది. ఇందులో 50 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనాలు బ్యాంకులు అకౌంట్‌హోల్డర్లకు బదలీ చేయలేదు.

వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు
ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది RBI వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు కీలక వడ్డీరేట్లయిన రెపో, రివర్స్ రెపోలను ఆర్బీఐ పెంచే అవకాశముందని గోల్డ్ మన్ సాచ్స్ భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణంపై ఆ ప్రభావం ఉంటుందని, అన్ని వస్తువుల ఉత్పత్తుల ధరలకు రెక్కలు రావచ్చని అభిప్రాయం. ఇప్పటికే ఆర్బీఐ ఆమోదయోగ్యస్థాయిని ద్రవ్యోల్బణం గణాంకాలు దాటేశాయని, ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని అభిప్రాయపడింది.

ద్రవ్యోల్భణం భయంతో..
గత ఏడాది ఫిబ్రవరి 7 నుండి డిసెంబర్ 5 వరకు జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల్లో చివరిసారి మినహా అంతకుముందు వరుసగా అయిదుసార్లు రెపో రేటును తగ్గించింది. మొత్తం 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.15 శాతానికి దిగి వచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధి లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకున్న ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం భయాలతో చివరి సమావేశంలో రెపో రేటు తగ్గించలేకపోయింది.


Click it and Unblock the Notifications