rbi mpc: భారత వృద్ధిరేటుపై RBI అంచనాలు.. గ్రామీణ, పట్టణ డిమాండ్ ఏమి సూచిస్తోందంటే ?
rbi mpc: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులు పలు దేశాలను భయపెడుతున్నాయి. కానీ భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం భయపడాల్సిన అవసరం లేదంటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ ఊపందుకున్నట్లు చెబుతోంది. వ్యవసాయం, ఉత్పత్తి రంగాలు పరిస్థితి మెరుగ్గా ఉందని భరోసా ఇస్తోంది. వీటన్నిటినీ కలిపి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని RBI గవర్నర్ ప్రకటించారు.

ఇవీ వృద్ధి అంచనాలు
2023-24 సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ బుధవారం అభిప్రాయపడింది. ఇదే సమయంలో వాస్తవిక వృద్ధి రేటు 6.5 శాతంగా 2022-23 ఆర్థిక సర్వే సైతం పేర్కొంది. 2022-23లో GDP 7 శాతం వృద్ధి చెందనున్నట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సైతం ముందస్తు అంచనా వేసింది.

పట్టణ డిమాండ్ లో స్థిరమైన వృద్ధి
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిరతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని మానిటరీ పాలసీ సమీక్ష ఆవిష్కరణలో RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాలుగవ త్రైమాసికాల డేటాను పరిశీలిస్తే, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయన్నారు. ప్రయాణాలు, పర్యాటకం, ఆతిథ్యం వంటి సేవలపై ప్రజలు ఆచితూచి ఖర్చు పెడుతుంటంతో.. పట్టణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ వృద్ది స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు.

జోరుగా గ్రామీణ డిమాండ్
డిసెంబర్ లో జరిగిన ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలను పరిశీలిస్తే.. గ్రామీణ డిమాండ్ సైతం మెరుగవుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. రబీ ఉత్పత్తిపై ఉన్న అధిక అంచనాల కారణంగా.. వ్యవసాయం, గ్రామీణ డిమాండ్ పెరిగిందన్నారు. రుణ వృద్ధి, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరచడం, మూలధన వ్యయం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసకోవడం వెరసి పెట్టుబడి కార్యకలాపాలను పెంచాయన్నారు.

వాణిజ్య రంగంలో పెరిగిన క్యాష్ ఫ్లో..
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు, దేశీయ విమాన ప్రయాణాల్లో బలమైన వృద్ధి నమోదైనట్లు శక్తికాంత దాస్ చెప్పారు. ఇన్వెస్ట్ మెంట్ కార్యకలాపాలు సైతం మంచి ట్రాక్ లో ఉన్నాయని తెలియజేశారు. ఏడాది క్రితం రూ.12.5 లక్షల కోట్లుగా ఉన్న వాణిజ్య రంగం క్యాష్ ఫ్లో.. 2022-23లో ఇప్పటివరకు రూ.20.8 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారు. వివిధ హై-ఫ్రీక్వెన్సీ సూచికలు సైతం ఆర్థిక వ్యవస్థ బలోపేతాన్నే సూచిస్తుండటం శుభపరిణామన్నారు.

అయినా సమస్యలున్నాయ్..
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆర్థిక మాంద్యం ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతోందని దాస్ అభిప్రాయపడ్డారు. కానీ సుదీర్ఘంగా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను మరింత కఠినంగా మార్చే అవకాశం ఉందన్నారు. బాహ్య డిమాండ్ మందగించడమూ దేశీయ ఉత్పత్తికి ప్రతికూలంగా తయారైందని తెలిపారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, 2023-24లో వాస్తవ GDP వృద్ధి 6.4 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేశామన్నారు. Q1లో 7.8 శాతం, Q2లో 6.2 శాతం, Q3లో 6 శాతం, Q4లో 5.8 శాతం చొప్పున వృద్ధి రేటు ఉండవచ్చన్నారు.

అంతర్జాతీయ సంస్థలూ భారత్ వైపే..
ప్రపంచ బ్యాంక్, IMF, ADB వంటి అంతర్జాతీయ సంస్థలు.. భారత్ వృద్ధిరేటుపై కనబరచిన దృక్పథాన్నే దాదాపు RBI కూడా కొనసాగించిందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఏర్పడే పరిణామాలను బట్టి GDP వాస్తవ వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం మధ్యలో ఉండవచ్చన్న RBI గవర్నర్ ప్రకటనతో ఏకీభవిస్తున్నారు.


Click it and Unblock the Notifications