కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశమంతా లాక్ డౌన్ విధించే పరిస్థితి లేనప్పటికీ, ప్రాంతాలవారీగా లాక్ డౌన్, ఆంక్షలు మాత్రం ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రికవరీ ఆందోళన కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అనిశ్చితుల కారణంగా ఏప్రిల్ 7న విడుదలయ్యే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రేట్ల కోతకు ఆర్బీఐ మొగ్గు చూపకపోవచ్చునని, యథాతథంగా ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

వడ్డీ రేట్లు యథాతథం
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను తొలి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏప్రిల్ 5వ తేదీ నుండి 7వ తేదీల్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరగనుంది. ద్రవ్యోల్భణ ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రెపో రేటును మార్చే అవకాశం లేదని తెలుస్తోంది. సర్దుబాటు ధోరణి కొనసాగించవచ్చునని, సరైన సమయంలో వృద్ధిని పెంచేందుకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను నాలుగు శాతానికి కుదించారు. గత మే 22న వడ్డీ రేటును 4 శాతానికి తగ్గించింది. ఈ కనిష్టస్థాయి కంటే తక్కువకు దిగి రాకపోవచ్చునని అంటున్నారు.

అందుకే కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చు
ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేస్తూనే వృద్ధికి తోడ్పడటం, ద్రవ్య, పరపతి విధానం లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్భణం అదుపులో ఉంది. కానీ జీడీపీలో అధిక వాటా కలిగిన మహారాష్ట్ర, గుజరాత్‌లలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఏప్రిల్ 7న ప్రకటించే పరపతి, ద్రవ్య విధాన పాలసీలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు.

గాడినపడే వరకు..
వృద్ధి రేటు పూర్తిగా గాడినపడే వరకు సర్దుబాటు పరపతి విధానమే కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలుమార్లు సంకేతాలు ఇచ్చారు. కరోనా ఒక కొలిక్కి వచ్చే వరకు వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయని మార్కెట్ వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చాయి. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా ఉండగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications