RBI Shock: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న జీవన వ్యయం వెరసి సగటు భారతీయుల ఖర్చుపెట్టే సామర్థ్యం పెరిగింది. క్రెడిట్ కార్డుల ద్వారా చాలా సులువుగా ఆన్ లైన్ లో కొనుగోళ్లు జరిపేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇక మీదట క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు పొందడం కఠినతరం కానుంది.
పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను కఠినతరం చేసింది. క్రెడిట్ రిస్క్ భారీ స్థాయిలో పెరుగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తద్వారా వ్యక్తిగత రుణాల హద్దుల్లేని వృద్ధికి బ్రేకులు వేయాలని భావిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు వీటిని మరింత ఖరీదైనవిగా మార్చేందుకు ఆదేశాలు జారీచేసింది.

బ్యాంకులు, NBFCల రిస్క్ వెయిట్‌లను RBI పెంచింది. అంటే నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు సంబంధించి కొంత మూలధనాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు 25 శాతం పెంచి బ్యాంకులకు 125, NBFCలకు 150 శాతంగా నిర్ణయించింది. తద్వారా ఆయా రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. దీంతో రుణగ్రహీతలు ఈ తరహా లోన్స్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు.
ఈ కొత్త నిబంధనలు వ్యక్తిగత, NBFCల రిటైల్ రుణాలకు వర్తిస్తాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. హౌసింగ్, విద్య, వాహన, బంగారు ఆభరణాలపై రుణాలకు మినహాయింపు ఇచ్చింది. రుణ గ్రహీతల తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ఆర్థిక సంస్థలు పట్టించుకోకపోవడం, 50 వేల లోపు రుణాల విభాగంలో డీఫాల్ట్స్ పెరుగుతుండటంతో RBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications