భారత ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ డీమానిటైజేషన్ ప్రకటించిన తర్వాత రూ.2000 నోట్లు కొత్తగా చెలామణిలోకి వచ్చాయి. అయితే వాటి జీవితకాలం 2023తో ముగిసిపోయింది.
వాస్తవానికి పెద్ద నోట్లు వద్దంటూనే రూ.2000 నోట్లు ప్రవేశపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే మార్కెట్లో డీమానిటైజేషన్ వల్ల లిక్విడిటీని వెంటనే తిరిగి ప్రవేశపెట్టేందుకు మెుదట్లో వాటిని ప్రవేశపెట్టినట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఇంత పెద్ద నోటుతో లావాదేవీలు జరపటం కష్టతరంగా మారటంతో ప్రజలు సైతం వీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం సైతం కొత్తగా ఈ నోట్లను ముద్రించటాన్ని నాలుగేళ్ల పాటు నిలిపివేసింది.

అయితే 2000 నోట్లను ప్రవేశపెట్టిన ప్రయోజనం పూర్తైనందున తిరిగి క్లీన్ నోట్ పాలసీ కింద వెనక్కి తీసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023లో నిర్ణయించటం గమనార్హం. 19 మే 2023న భారతదేశం తన అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. సెప్టెంబర్ 30లోగా వీటిని డిపాజిట్ చేసి చిన్న డినామినేషన్లకు మార్చుకోవాలని ప్రజలను కోరారు. అయితే ఈ నోట్లు చట్టబద్ధతను కలిగి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 30 తర్వాత రిజర్వు బ్యాంక్ ఆ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గడువు తర్వాత సైతం నోట్లను ప్రజలు RBI కలిగి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్కడైనా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే నవంబర్ ముగిసే నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇంకా ప్రజల వద్ద దాదాపు రూ.9,760 కోట్లు విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని, అవి తమకు ఇంకా తిరిగి రాలేదని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రజలు వీటిని మార్చుకుంటూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications