NBFC News: బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో గోల్డ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికితోడు డిజిటల్ ల్యాండ్ స్కేప్‌ను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
నగదు రుణాల పంపిణీని 20 వేల లోపు పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఈ పరిమితి నాన్ -బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (NBFC) వర్తిస్తుందని తెలిపింది. చట్టబద్ధ పరిమితికి మించి నగదు రుణాల పంపిణీ మరియు వసూళ్ల ఉల్లంఘనలకు గాను IIFL ఫైనాన్స్‌పై RBI చర్యలు తీసుకుంది. అనంతరం పలు NBFCలకు ఈ మేరకు లేఖలు పంపినట్లు తెలుస్తోంది.

IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో సెంట్రల్ బ్యాంక్ కొన్ని మెటీరియల్ సూపర్‌వైజరీ ఆందోళనలను లేవనెత్తింది. దీంతో గోల్డ్ లోన్‌ల మంజూరు లేదా పంపిణీ చేయకుండా నిషేధం విధించింది. రుణాల మంజూరు సమయంలో బంగారం స్వచ్ఛత, నికర బరువును పరీక్షించడంలో మరియు ధృవీకరించడంలో తీవ్రమైన ఉల్లంఘనలు గమనించినట్లు పేర్కొంది. రుణం-విలువ నిష్పత్తిలోనూ సమస్యలు గుర్తించినట్లు చెప్పింది.
దీనికితోడు డిజిటల్ లావాదేవీలను పెంచాలని కేంద్రం సహా ఆర్బీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్లో చలామణిలోని నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే NBFCల ద్వారా 20 వేల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే ఆ మొత్తం బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు.


Click it and Unblock the Notifications