కరోనా వైరస్ వ్యాప్తి, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను కార్యకలాపాలు నిలిచిపోకుండా, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఆర్బీఐ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. బిజినెస్ కాంటిజెన్సీ ప్లాన్‌లో (BCP) భాగంగా ఇలా వార్ రూంను ఓ కేంద్ర బ్యాంకు నెలకొల్పడం ప్రపంచంలోనే తొలిసారి. ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు అత్యంత ముఖ్యమైన 90 మంది ఉద్యోగులతో ఈ వార్ రూమ్ కార్యకలాపాలు సాగిస్తుంది.

24 గంటల్లో వార్ రూమ్
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఆర్బీఐ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మార్చి 19 నుండే బిజినెస్ కాంటిజెన్సీ ప్లాన్‌ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూం ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల్లో వార్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఎంతమంది ఉంటారంటే..
ఆర్బీఐకి చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్ 70 మంది ఇందులో విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ వార్ రూమ్ ప్రత్యేకంగా రుణ నిర్వహణ, రిజర్వ్స్ నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలాపాలు పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. BCP కింద నగదు బదిలీ లావాదేవీల సేవలైన RTGS, NEFT, స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (SFMS) తదితరాలను పర్యవేక్షిస్తారు.

ప్రపంచ యుద్ధ సమయంలోను లేదు..
ప్రపంచంలోనే ఈ తరహా BCP ఏర్పాటు చేయడం మొదటిసారి అని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలోను ఇలాంటి సదుపాయాలు లేవని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ-కుబేర్, ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంటివి కూడా ఇందులో ఉంటాయి.

ఉద్యోగుల నుండి కొంతమందిని తీసుకొని..
ఆర్బీఐకి ఉన్న 600 మంది ఉద్యోగుల నుండి 60 మంది కీలకమైన వారిని వార్ రూం కోసం తీసుకున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు 70 మంది ఉద్యోగులు ఉంటారు. దేశవ్యాప్తంగా 31 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో కలిపి 14,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1500 మంది వరకు నిర్వహిస్తారు.

వార్ రూమ్ ఇలా..
150 మంది ఆర్బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్ ప్రొవైడర్లు, 70% మంది ఫెసిలిటీ స్టాఫ్ (మెయింటెనెన్స్, సెక్యూరిటీ, కిచెన్, ఫ్రంట్ డెస్క్, అడ్మినిస్ట్రేషన్)కి సరిపడే ఒక బిల్డింగ్‌ను ఆర్బీఐ తీసుకుంది. ఇక్కడి సిబ్బంది నిరంతరం ఆ బిల్డింగ్‌లోనే ఉంటారు. తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బయటకు రావడం ఉండదు. వారికి అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్ రూమ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. ఏ సమయంలో చూసినా 45 మంది విధులు నిర్వహిస్తారు. మిగిలిన వారు రిజర్వ్‌లో ఉంటారు.


Click it and Unblock the Notifications