2000 Notes: దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా రిజర్వు బ్యాంక్ పర్యవేక్షిస్తుంటుంది. అయితే మోదీ సర్కార్ గతంలో డీమానిటైజేషన్ సమయంలో తీసుకొచ్చిన రూ.2000 నోట్లను క్లీన్ నోట్ పాలసీ కింద కొన్ని నెలల కిందట వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మరో ప్రకటనను విడుదల చేసింది.
జనవరి 1, 2024న రెండు వేల నోట్ల గురించి ప్రకటిస్తూ రిజర్వు బ్యాంక్ మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న మెుత్తం నోట్లలో 97.38 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడైంది. దీంతో డిసెంబర్ 29, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.9,330 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వాస్తవానికి ఈ నోట్లను ఇమ్మీడియట్ లిక్విడిటీ అవసరాలను తీర్చేందుకు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో తగినంత డబ్బు సర్క్యూలేషన్ లోకి రావటంతో 2000 నోట్లను వెనక్కి తీసుకోవటం జరిగింది.

వాస్తవానికి అక్టోబర్ 7, 2023న దేశంలోని ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను బ్యాంకుల వద్ద జమచేసి మార్చుకునేందుకు చివరి గడువు ముగిసింది. అయితే ఆ తర్వాత కూడా నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు వాటిని రిజర్వు బ్యాంక్ కార్యాలయాల వద్ద మార్చుకునేందుకు వెలుసుబాటును కల్పించటం జరిగింది. దీంతో ముంబై బ్రాంచ్ బయట ఇటీవల భారీ క్యూ లైన్లు సైతం ప్రత్యక్షం అయిన సంగతి తెలిసిందే. ఇంకా దేశంలోని ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ కోసం దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచి అయినా.. ఏదైనా RBI ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా 2000 నోట్లను మార్చుకునేందుకు పంపుతున్నారు.
అతిపెద్ద నోటుగా ఉన్న 2000ను వెనక్కి తీసుకున్నప్పటికీ వాటిని ఇప్పటికీ చెలామణి నుంచి రిజర్వు బ్యాంక్ నిరోధించలేదు. అంటే ఈ లెక్కన రెండు వేల రూపాయల నోటు ఇప్పటికీ చెల్లుబాటు అవుతుంది. అయితే దానిని బయట వ్యక్తిగత ఖర్చుల చెల్లింపులకు అంగీకరించబడవు.
వాస్తవానికి 2000 నోట్లు తొలిసారిగా నవంబర్ 2016లో డిమానిటైజేషన్ తర్వాత త్వరిత అవసరాలను తీర్చటం కోసం చెలామణిలోకి తీసుకొచ్చిన సంగతి చెలిసిందే. ప్రస్తుతం 2000 నోట్లకు చట్టబద్దత ఉన్నందున రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం చాలా మంది ఓటర్లకు తమ వద్ద ఉన్న వాటిని పంచే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రకారం రానున్న 6 నెలల్లో మరిన్ని నోట్లు తిరిగి రిజర్వు బ్యాంకుకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications