Tokenisation: కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డుల భద్రతతో పాటు గోప్యత కోసం రిజర్వు బ్యాంక్ కొత్త విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఇందుకోసం కార్డ్ టోకనైజేషన్ విధానాన్ని అమలు చేసేందుకు చివరి గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గతంలో జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని భావించినప్పటికీ, వినియోగదారుల డిమాండ్ కారణంగా టోకనైజేషన్ ప్రక్రియ పొడిగించబడింది. అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

నూతన సాంకేతికత..
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో.. వినియోగదారుల భద్రత కోసం రిజర్వు బ్యాంక్ కొత్త విధానాన్ని అమలులోకి తెస్తోంది. ముఖ్యంగా డేటా చౌర్యం, బ్యాంకు ఖాతాల హ్యాకింగ్, కార్డ్ క్లోనింగ్, ఫిషింగ్ వంటి అనేక సైబర్ సమస్యలను ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నారు. అయితే.. దీని నుంచి వినియోగదారులను రక్షించేందుకు బ్యాంకింగ్ రంగంలో అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ లేదా యూపీఐ ఐడీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేయడం పెరుగుతున్న నేపథ్యంలో ఇది మోసాలను అరికట్టేందుకు దోహదపడుతుంది.

కార్డుల వివరాలు సేవ్ చేయకూడదనుకుంటున్నారా?
ప్రస్తుతం డేటా చౌర్యం అనేది మనం తరచుగా వినే సమస్య. దీన్ని నివారించడానికి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు టోకనైజేషన్ విధానాన్ని అమలోకి తెస్తోంది. కస్టమర్లు కొనుగోలు చేసినప్పుడు.. షాపింగ్ సైట్‌లు వినియోగదారుల వివరాలను, బ్యాంకింగ్ వివరాలను తమ వద్ద స్టోర్ చేస్తుంటాయి. ఇవి సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి.. ఈ అవకాశాన్ని తొలగించేందుకు, ఏ సైట్ కస్టమర్ వివరాలను సేకరించకూడదని RBI ఆదేశించింది.

టోకనైజేషన్ అంటే ఏమిటి?
కార్డ్ టోకనైజేషన్ వల్ల లావాదేవీలో పాల్గొన్న పార్టీలకు( అమ్మేవారికి, బ్యాంక్) కార్డ్ జారీ చేసే వ్యక్తి , కార్డ్ నెట్‌వర్క్ మినహా కస్టమర్ వివరాలకు నేరుగా యాక్సెస్ ఉండదు. అందువల్ల.. కస్టమర్ డేటా ఎక్కడా సేవ్ చేయబడదు. కస్టమర్‌లు వారు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌ల నుంచి టోకెన్‌ను అభ్యర్థించినప్పుడు, కార్డ్ జారీ చేసిన ఫైనాన్స్ సంస్థ ఆమోదంతో కార్డ్ నెట్‌వర్క్ టోకెన్‌ను రూపొందిస్తుంది. ఇది కస్టమర్ డేటా సురక్షితంగా ఉంచేందుకు ఉద్ధేశించినది.

యాక్సెస్ నిరాకరణ.. ప్రతిసారీ..
కొత్త విధానం అమలులోకి వస్తే.. షాపింగ్ సైట్‌లతో సహా వ్యాపారుల వద్ద ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్‌లు తొలగించబడతాయని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. కార్డ్ నంబర్లను మునుపటిలా నేరుగా యాక్సెస్ చేయబడవని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇకపై లావాదేవీలు జరిపిన ప్రతిసారీ.. కార్డ్-టోకనైజేషన్ కోసం సమ్మతి మంజూరు తప్పనిసరి. లేని పక్షంలో ప్రతిసారీ కార్డ్ డేటాను మాన్యువల్‌గా టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే వివరాలు సేవ్ చేయటం అసాధ్యం.

OTP తప్పనిసరి..
కస్టమర్‌లు తమ కార్డ్ డేటాను టోకనైజ్ చేయడానికి సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్లయితే.. లావాదేవీని పూర్తి చేయడానికి CVV, OTP నంబర్ తర్వాత కార్డ్ టోకెన్‌ను నమోదు చేయాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఇది మీ కార్డ్ సమాచారాన్ని ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి కాపాడుతుంది.


Click it and Unblock the Notifications