RBI on 2000 Notes: 2000 రూపాయల నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్ మరో కొత్త అప్‌డేట్ విడుదల చేసింది. ఈ పెద్ద నోట్లను క్లీన్ నోట్ పాలసీ కింద దేశంలో చెలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇది ఇప్పటికీ లీగల్ టెండర్ గా అర్హతను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
తాజా గణాంకాల ప్రకారం.. 2,000 బ్యాంకు నోట్లలో 97.69 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటికీ దేశంలో ప్రజల వద్ద రూ.8,202 కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నాయని తాజా గణాంకాలను వెల్లడించింది. రూ.2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడినప్పుడు మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. అయితే మార్చి 2024లో ఆ సంఖ్య రూ.8,202 కోట్లకు తగ్గింది.

రూ.2000 నోట్లను సెప్టెంబరు 30, 2023లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని తొలుత దేశంలోని ప్రజలందరినీ రిజర్వు బ్యాంక్ కోరింది. అయితే తరువాత గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించబడింది. అక్టోబరు 7, 2023 తర్వాత కూడా బ్యాంకు బ్రాంచ్‌లలో నోట్లను డిపాజిట్ చేసే, మార్చుకునే సదుపాయం నిలిపివేసి.. అక్టోబర్ 8, 2023 నుంచి దేశంలోని తన 19 కార్యాలయాల్లో 2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఏర్పాట్లు చేసింది.
రూ.2000 నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుండి ఏదైనా RBI జారీ చేసే రిజర్వు బ్యాంక్ 19 కార్యాలయాలకు పంపవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇప్పటికీ రూ.2000 నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే అవకాశం అందుబాటులోనే ఉంది.


Click it and Unblock the Notifications