ఎక్కువమంది నిపుణులు, ఆర్థికవేత్తల అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను వరుసగా పదోసారి స్థిరంగా కొనసాగించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ 8వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన ముగిసింది. ఈ రోజు(10, ఫిబ్రవరి) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ MPC సమావేశం నిర్ణయాలను మీడియాకు తెలిపారు. కరోనా ముప్పు పూర్తిగా తొలగకపోవడం, అధిక ద్రవ్యోల్బణం వంటి భయాల కారణంగా ఈసారీ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటు నాలుగు శాతంగా కొనసాగించగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు ఈసారి కూడా సర్దుబాటు ధోరణి కొనసాగించినట్లు తెలిపారు. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారి 2020 మే నెలలో రెపోరేటును 4 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. అప్పటి నుండి అంటే దాదాపు రెండేళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది.

వృద్ధి రేటు అంచనా
ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 9.2 శాతానికి కుదించింది. డిసెంబర్ నాటి సమావేశంలో దీనిని 9.5 శాతంగా అంచనా వేసింది. FY23 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతంగా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 5.3 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 4.5 శాతంగా అంచనా వేస్తోంది.

కరెంట్ ఖాతా లోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2 శాతం కంటే తక్కువగా ఉంది. గ్లోబల్ స్పిల్ ఓవర్ల నుండి భారత రూపాయి నిలకడగా ఉంది. దేశంలో అధిక ఫారెక్స్ నిల్వలు, మితమైన కరెంట్ ఖాతా లోటు ఉంది. గ్లోబల్ స్పిల్ ఓవర్స్ నుండి దేశీయ మార్కెట్‌ను ఆర్బీఐ ఇన్సులేట్ చేస్తుంది.

ఆర్బీఐ కీలక నిర్ణయాలు
డిజిటల్ రూపీని ఎన్నిసార్లైనా వాడుకునే వెసులుబాటును కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రూపీపై ప్రస్తుతం ఉన్న రూ.10,000 పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా వేసింది.
రివర్స్ రెపో, రెపో రేటులో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం కాగా, రివర్స్ రెపో 3.3 శాతంగా ఉంది.
నిత్యావసర ధరలు అదుపులో ఉంటాయి. పప్పులు, వంట నూనె ధరల్లో ఉత్పత్తి పెరిగినందున ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. గత నవంబర్ నుండి పెట్రోల్ ధరలు పెంచకపోవడం వల్ల ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.
ఒమిక్రాన్ ప్రభావం మూడో త్రైమాసికం, నాలుగో త్రైమాసికంలో పెద్దగా లేదు.
కరోనా ప్రభాం నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది.
FY23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 4.5 శాతానికి పరిమితం.
కమర్షియల్ బ్యాంకుల పనితీరు మెరుగుపడుతోంది.
వంట నూనెల దిగుమతి, క్రూడ్ అయిల్ ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కొంత తగ్గాయి.
లతా మంగేష్కర్ జీనా హై అనే పాటను గుర్తు చేస్తూ కరోనా కష్టాల్లో కూడా దేశం ధైర్యంగా ముందుకు సాగుతోందని శక్తికాంతదాస్ ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications