ఆ బ్యాంకులో కుంభకోణం.. అప్రమత్తమైన ఆర్బీఐ ఏం చేసిందంటే ?
బ్యాంకుల్లో జరుగుతున్న కుంభకోణాల కారణంగా ఆ బ్యాంకు కస్టమర్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) లో చోటుచేసుకున్న కుంభకోణం ఫలితంగా ఆ బ్యాంక్ కస్టమర్లు నగదు ఉపసంహరణ విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికీ వారి ఇబ్బందులు తొలగిపోలేదు. ఈ బ్యాంకులో కుంభకోణం వల్ల స్వయంగా భారత రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
తాజాగా ఆర్బీఐ మరో ప్రతిపాదన చేసింది. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఇచ్చే రుణ వితరణపై ఆంక్షలు విధించింది. ఒక సంస్థ లేదా రుణ గ్రహీతల బృందానికి ఇచ్చే రుణ మొత్తంపై పరిమితి విధించింది. ఒక సంస్థకు, రుణ గ్రహీతల బృందానికి ఇచ్చే మొత్తాన్ని వరుసగా 10 శాతం, 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. పీఎంసీ బ్యాంక్ తరహా కుంభకోణాలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై ఈ నెల 20 లోగా అభిప్రాయాలు తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ ఆర్బీఐ ప్రతిపాదన అమల్లోకి వస్తే అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఆ మేరకు రుణ వితరణ పరిమితిని తగ్గించుకోవలసి ఉంటుంది.

ఇప్పుడు ఎలా ఉందంటే...
ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఒక రుణగ్రహీత లేదా రుణగ్రహీతల బృందానికి అవసరమైన మూలధన నిధుల్లో వరుసగా 15 శాతం, 40 శాతం వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. దీని వల్ల పెద్ద మొత్తంలో రుణాలను రుణగ్రహీతలు పొందుతున్నారు. పీఎంసీ బ్యాంకు హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్ డీ ఐ ఎల్ ) గ్రూప్ కంపెనీలకు 6226 కోట్ల రుణాన్ని ఇచ్చింది. దీని మూలంగానే బ్యాంకు కుప్పకూలింది. పెద్ద మొత్తంగా ఒక సంస్థకే రుణాన్ని మంజూరు చేసినప్పుడు ఆ సంస్థ దాన్ని తిరిగి చెల్లించలేక పోతే మొత్తం బ్యాంకుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ఇవీ బ్యాంక్ కస్టమర్ల కష్టాలు...
పీఎంసీ బ్యాంకులో కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ బ్యాంకు కస్టమర్లు తీవ్ర ఇబ్బందులను చవిచూడాల్సి వచ్చింది. 9.15 లక్షలకు పైగా డిపాజిటర్లు ఆర్బీఐ నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని పట్ల బ్యాంకు కస్టమర్లు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. బ్యాంకు ముందు ఆందోళనలు చేశారు. అయితే బ్యాంకులోని పరిణామాలను పరిశీలించిన తర్వాత నగదు ఉపసంహరణపై ఆర్బీఐ క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వచ్చింది.
బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళనలు
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకునే బడా వ్యాపారాలు వాటిని ఎగవేస్తుండటం వల్ల ఆ బ్యాంకులపై భారం పడుతోంది. మొండి పద్దులు కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయి కాబట్టి బ్యాంకులు నష్టాల పాలవుతున్నాయి. దీనివల్ల బ్యాంకు షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద కరిగిపోతోంది. బ్యాంకుల్లో ఇతర సంక్షోభాలు బట్టబయలయినప్పుడు కూడా కస్టమర్లు తమ డిపాజిట్లకు ఏమవుతుందోనన్న ఆందోళనలకు గురవుతున్నారు.


Click it and Unblock the Notifications