రూ. 10 వేలు కంటే ఎక్కువ పంపితే గంట సేపు ఆగాల్సిందే! RBI షాకింగ్ రూల్.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ, సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వారి ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ఆన్‌లైన్ పేమెంట్స్‌లో భద్రతను పెంచడానికి ఆర్‌బీఐ నాలుగు అంచెల రక్షణ వ్యవస్థను ప్రతిపాదించింది.

గంట సేపు వెయిటింగ్.. ఎందుకు?
ఆర్‌బీఐ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (P2P) జరిగే రూ. 10,000 పైబడిన లావాదేవీలను గంట సేపు నిలిపివేయనున్నారు. అంటే మీరు డబ్బులు పంపిన తర్వాత, ఆ మొత్తం అవతలి వ్యక్తి ఖాతాలో చేరడానికి గంట సమయం పడుతుంది. ఈ గ్యాప్ ఎందుకంటే.. ఒకవేళ మీరు మోసగాడికి డబ్బు పంపినట్లు ఆ గంటలోపు గుర్తిస్తే, వెంటనే ఆ లావాదేవీని రద్దు (Cancel/Reverse) చేసే అవకాశం మీకు ఉంటుంది. మోసగాళ్లు సాధారణంగా బాధితులను భయపెట్టి లేదా అత్యవసరం అని నమ్మించి త్వరగా డబ్బులు పంపేలా చేస్తారు. ఈ 'వన్ అవర్' రూల్ వల్ల బాధితులకు ఆలోచించే సమయం దొరుకుతుంది.
మర్చంట్ పేమెంట్స్‌కు మినహాయింపు
అయితే, షాపింగ్ మాల్స్‌లో లేదా ఆన్‌లైన్ పోర్టల్స్‌లో వస్తువులు కొన్నప్పుడు చేసే మర్చంట్ పేమెంట్స్‌కు ఈ నిబంధన వర్తించదు. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే బదిలీలకే (Bank transfers) ఇది వర్తిస్తుంది. దీనివల్ల నిత్యావసర కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రక్షణ
వృద్ధులు , వికలాంగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలను అరికట్టడానికి RBI మరో కీలక ప్రతిపాదన చేసింది. 70 ఏళ్లు పైబడిన వారు లేదా వికలాంగులు రూ. 50,000 కంటే ఎక్కువ డబ్బు పంపాలనుకుంటే, వారి నమ్మకస్తులైన వ్యక్తి (Trusted Contact) నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోకుండా రక్షణ లభిస్తుంది. అలాగే, అనుమానాస్పదంగా కనిపించే ఖాతాలకు (Mule Accounts) ఏడాదికి ఇంతే డబ్బు క్రెడిట్ అవ్వాలనే పరిమితిని కూడా విధించనున్నారు.
'కిల్ స్విచ్' , 25 లక్షల లిమిట్
సైబర్ మోసం జరుగుతోందని మీకు అనుమానం రాగానే, వెంటనే మీ డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ నిలిపివేసేలా ఒక 'కిల్ స్విచ్' (Kill Switch) ఆప్షన్‌ను కూడా బ్యాంకులు అందుబాటులోకి తేవాలని ఆర్‌బీఐ సూచిస్తోంది. అటు రూ. 25 లక్షలు దాటిన లావాదేవీలపై అదనపు తనిఖీలు ఉంటాయి.
ప్రజల అభిప్రాయమే ముఖ్యం
ఈ ప్రతిపాదనలపై RBI ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరింది. అందరి స్పందనలు విన్న తర్వాత అధికారికంగా నిబంధనలను అమలులోకి తెస్తుంది. ఆన్‌లైన్ మోసాల వల్ల సామాన్యుడి కష్టార్జితం పోకుండా ఉండాలంటే, ఇలాంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీతో పాటు భద్రత కూడా పెరిగితేనే డిజిటల్ ఇండియా మరింత బలోపేతం అవుతుంది.


Click it and Unblock the Notifications