Banking news: నిబంధనలు పాటించని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝళిపిస్తూ ఉంటుంది. ఇటీవల కొన్నింటిపై అపరాధ రుసుము విధించగా, మరికొన్నింటి లైసెన్సులు రద్దు చేసింది. తాజాగా HSBCకి కేంద్ర బ్యాంకు వాత పెట్టింది. ఈ మేరకు భారీగా ఫైన్ కట్టాలని ఆదేశించింది.
భారతీయ నిబంధనలను పాటించనందుకు HSBCపై రూ. 1.73 కోట్ల జరిమానా విధించినట్లు RBI తెలిపింది. సేవల్లో లోపాలపై ఆధారపడి ఈ చర్య తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 31, 2021 నాటికి ఆ బ్యాంకు ఆర్థిక స్థితి, రిస్క్ అసెస్ మెంట్ రిపోర్ట్ తయారుచేసేందుకు జరిపినప్పుడు దీనిని గుర్తించినట్లు పేర్కొంది.

బకాయిలు లేని వివిధ క్రెడిట్ కార్డులకు సంబంధించి మొత్తం నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు HSBC తప్పుడు సమాచారం అందించినట్లు RBI గుర్తించింది. తద్వారా రిజర్వ్ బ్యాంకు రూల్స్ ను అతిక్రమించినందుకు ఈ బ్యాంకుపై చర్యలకు ఉపక్రమించింది. దీని గురించి లోతైన దర్యాప్తు కోసం బ్యాంకుకు నోటీసు సైతం ఇచ్చినట్లు RBI చెప్పింది.

CIC నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చెప్పాలని HSBCకి RBI నోటీసులు పంపింది. అందుకు అది ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణ సమయంలోని మౌఖిక సమర్పణలను పరిగణలోనికి తీసుకున్న అనంతరం, నగదు పెనాల్టీ విధించాలని నిర్ధారణకు వచ్చింది.


Click it and Unblock the Notifications