1000 Notes: దేశంలో ప్రస్తుతం పెద్ద కరెన్సీ నోట్ల అంశంపై భారీగా చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా మళ్లీ రూ.1000 నోట్ల చెలామణి వార్త తెరమీదకు వచ్చింది.
క్లీన్ నోట్ పాలసీ కింద నోట్ల రద్దు సమయంలో విడుదల చేసిన రూ.2000 నోట్లను ఇటీవల రిజర్వు బ్యాంక్ చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత చర్చ రూ.1000 నోట్లపై పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెరమీదకు రూ.1000 నోట్లు తిరిగి వస్తాయంటూ కొంత చర్చ జరుగుతోంది. అయితే మార్కెట్లోకి ఈ ఊహాగానాలను ఎవరు తీసుకొచ్చారనే విషయం పక్కన పెడితే దీనిపై క్లారిటీ చాలా ముఖ్యం.

జోరుగా ఈ వార్త వైరల్ కావటంతో దీనిపై ఏఎన్ఐ వార్తా సంస్థ.. మూలాలను ఉటంకిస్తూ రిజర్వు బ్యాంక్ వెయ్యి రూపాయల నోట్లను తిరిగి చెలామణిలోకి తీసుకొచ్చే ఆలోచనలో లేదంటూ క్లారిటీ ఇచ్చిది. దీంతో తిరిగి రూ.1000 నోట్లు మార్కెట్లోకి త్వరలో రాబోతున్నాయనే వార్తలో వాస్తవం లేదని తేలిపోయింది. దీనికి ముందు ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ నుంచి వెనక్కి తీసుకున్న తర్వాత రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ప్రతిపాదన లేదని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు పేరుతో మోదీ ప్రభుత్వం 2016లో డీమోనిటైజేషన్ ప్రకటించింది. ఆ సమయంలో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేశారు. కానీ వాటి స్థానంలో కొత్తగా రూ.500 నోట్లు, రూ.2,000 నోట్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లను కూడా రానున్న కాలంలో రిజర్వు బ్యాంక్ తిరిగి వెనక్కి తీసుకుంటుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది నిపుణులు సైతం ఆ అవకాశం ఉందంటూ బదులివ్వటం కొంత అనుమానాలకు తావిస్తోంది.
ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్ల ప్రవేశ లక్ష్యం నెరవేరిందంటూ వాటి ముద్రణను 2018-19లో ఆపేశారు. ఆ తర్వాత వాటిని పూర్తిగా ఆర్థిక వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకునే గడువు ముగిసినందున ఎవరైనా ఇంకా నోట్లను కలిగి ఉంటే దేశంలోని 19 రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు వెసులుబాటును కల్పించారు.


Click it and Unblock the Notifications