RBI New Rules: ఏప్రిల్ 1 నుండి మీ ఆన్‌లైన్ పేమెంట్స్ మారుతున్నాయి.. కొత్త రూల్స్ ఇవే!
ప్రస్తుతం మనం ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు మన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఏప్రిల్ 1 నుండి ఈ విధానంలో మార్పు రాబోతోంది. ప్రతి డిజిటల్ లావాదేవీకి తప్పనిసరిగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఉండేలా ఆర్బీఐ కొత్త రూల్స్ (RBI new rules) తీసుకురానుంది. అంటే ఒక లావాదేవీ పూర్తి కావాలంటే మీరు కనీసం రెండు రకాల భద్రతా అంచెలను దాటాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 1 నుండి ఏం మారుతుంది?
కొత్త నిబంధనల ప్రకారం.. లావాదేవీ చేసేటప్పుడు కింది వాటిలో కనీసం రెండింటిని వాడాల్సి ఉంటుంది..
- పాస్‌వర్డ్‌లు లేదా పిన్ (PIN) నంబర్లు
- SMS ద్వారా వచ్చే ఓటీపీలు
- బయోమెట్రిక్స్ (వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్)
- సాఫ్ట్ వేర్ ఆధారిత టోకెన్లు లేదా హార్డ్‌వేర్ టోకెన్లు
ముఖ్యంగా ఈ రెండు అంచెల్లో ఒకటి తప్పనిసరిగా 'డైనమిక్' (ప్రతి లావాదేవీకి మారుతూ ఉండేది) అయి ఉండాలి. దీనివల్ల హ్యాకర్లు మీ పాత వివరాలతో లావాదేవీలు జరపడం సాధ్యం కాదు.
ఓటీపీల నుండి టెక్నాలజీ వైపు..
ఇప్పటివరకు మనం ఎక్కువగా ఓటీపీల మీద ఆధారపడుతున్నాం. కానీ, సిమ్ స్వాపింగ్ (SIM Swap) , ఫిషింగ్ దాడుల వల్ల ఓటీపీలు కూడా సురక్షితం కాదని తేలింది. అందుకే ఆర్‌బీఐ బయోమెట్రిక్స్, డివైజ్ బైండింగ్ వంటి పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇది కేవలం భద్రతను పెంచడమే కాకుండా ఓటీపీలు రాకపోయే సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కస్టమర్లకు మరింత రక్షణ - బ్యాంకుల బాధ్యత
ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో ఒక కీలకమైన అంశం ఏమిటంటే 'ఇష్యూయర్ లయబిలిటీ' (Issuer Liability). అంటే ఏదైనా బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ ఈ కొత్త నిబంధనలను పాటించకపోవడం వల్ల కస్టమర్ ఖాతా నుండి డబ్బు పోతే ఆ బాధ్యత సదరు బ్యాంకుదే అవుతుంది. బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులు తమ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేలా చేస్తుంది.
రిస్క్ ఆధారిత తనిఖీలు
లావాదేవీ విలువ, వినియోగదారుడి ప్రవర్తన ఆధారంగా భద్రతా తనిఖీలు మారుతుంటాయి. ఉదాహరణకు మీరు క్రమం తప్పకుండా చేసే చిన్న లావాదేవీలకు తక్కువ భద్రతా అంచెలు ఉండవచ్చు. కానీ, అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు లేదా కొత్త పరికరం నుండి లాగిన్ అయినప్పుడు బ్యాంకులు అదనపు వెరిఫికేషన్ కోరవచ్చు.
అంతర్జాతీయ లావాదేవీలకు కూడా..
దేశీయంగానే కాకుండా, అక్టోబర్ 1, 2026 నుండి అంతర్జాతీయ ఆన్‌లైన్ లావాదేవీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల విదేశీ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసేటప్పుడు జరిగే మోసాలను అరికట్టవచ్చు.
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ జాగ్రత్తలు కూడా పెరగాలి. RBI తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. దీర్ఘకాలంలో మన కష్టార్జితం భద్రంగా ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో నమ్మకాన్ని పెంచడానికి ఈ మార్పులు ఎంతో అవసరం.


Click it and Unblock the Notifications