ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేయవద్దు, పెట్రోల్ ధరలు తగ్గిస్తే భారమే
లోటు భర్తీని పూరించేందుకు నగదు ముద్రణ సరికాదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అలా చేయకూడదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(NIPFP) డైరెక్టర్ పినాకీ చక్రవర్తి అన్నారు. కరోనా థర్డ్ వేవ్ లేకుంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ద్రవ్యోల్భణం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమని, ద్రవ్యోల్భణాన్ని నిర్వహించగలిగే స్థాయికి స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు నగదు ముద్రణ అవసరం లేదని తన అభిప్రాయం అన్నారు. ఆర్బీఐ ఎప్పుడు అలా చేస్తుందని తాను భావించడం లేదన్నారు.

వృధా వ్యయాలకు దోహదం
నగదును ముద్రించడం వృధా వ్యయాలకే దోహదపడుతుందన్నారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు నగదు ముద్రణే ప్రత్యామ్నాయం అన్న చర్చ కరోనా ప్రారంభ కాలంలో మొదలైందని, అయితే ఆర్బీఐ ఇలా చేస్తుందని తాను భావించడం లేదన్నారు. ఆర్బీఐ ఆర్థిక లోటును పూడ్చేందుకు నగదును ముద్రిస్తుందంటే ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఆదుకునేందుకు తాను ఉన్నానని ప్రభుత్వానికి భరోసా ఇవ్వడమే అన్నారు. అంతేకాకుండా విచ్చలవిడి వ్యయాలకు తెర తీసినట్లవుతుందన్నారు. 1996లోనే ఆర్బీఐ, ప్రభుత్వం ఒక అవగాహనా ఒప్పందం ద్వారా అదనపు నగదు ముద్రణ నిలిపివేశాయన్నారు. మళ్లీ ఆ స్థితికి తిరోగమించకూడదన్నారు.

ఉద్యోగాలపై...
కరోనా థర్డ్ వేవ్ ఉదృతి ముప్పు అంతగా లేనందున ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత స్థూల ఆర్థిక వాతావరణం తొలి విడత కరోనా కాలంలో ఉన్నంత తీవ్రంగా లేదన్నారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన వృద్ధి సాధ్యమేనని చెప్పారు. అధిక ద్రవ్యోల్బణం ఎప్పుడైనా ఆందోళనకరమేనని, దానిని నిర్వహణీయ స్థితికి తగ్గించడం అవసరమన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక తిరోగమన స్థితిలో ఏర్పడిన ఉద్యోగ నష్టాన్ని పూడ్చడం సాధ్యం కాదన్నారు. త్వరిత రికవరీ ద్వారా మాత్రమే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారమే
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉద్దీపన లక్ష్యం ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింప చేయడం కోసమే అన్నారు. ప్రభుత్వం ప్రకటించే ఉద్దీపనలు ఏవైనా ఎంత మేరకు ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు దోహదపడేలా రూపొందించారనేది ప్రధానం అన్నారు. ప్రస్తుత వ్యయాలను పెంచే అవకాశాలు తక్కువ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దారుణంగా పెరిగిన నేపథ్యంలో వాటిపై పన్నును తగ్గిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుందన్నారు.


Click it and Unblock the Notifications