ప్రారంభమైన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్..రెపోరేటు తగ్గింపు పైనే సామాన్యుల ఆశలన్నీ..
RBI MPC Meeting: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) మూడు రోజుల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ సమావేశం మార్కెట్లు, వ్యాపార వర్గాలు, సాధారణ రుణగ్రహీతలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. MPC ప్రధాన లక్ష్యం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి.. ద్రవ్యోల్బణం (Inflation), వృద్ధి (Growth) మధ్య సమతుల్యతను కాపాడే విధంగా రెపో రేటు (Repo Rate), ఇతర పాలసీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడం.
ఈ సమావేశంలో సభ్యులు మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య ప్రభావాలు, ద్రవ్యోల్బణ ధోరణులు, వృద్ధి అంచనాలను చర్చిస్తారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అక్టోబర్ 1 బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఏడాది చివరి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నిర్ణయం రుణ ఖర్చులు, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందువల్ల ఈ ప్రకటన స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగం, సాధారణ వినియోగదారులకూ కీలకం కానుంది.
గత ఆగస్టు సమావేశంలో MPC రెపో రేటును 5.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. అయితే దాని ముందు జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) కోత అమలు చేశారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఒక్కొక్కసారిగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. అయితే 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్యకాలంలో మాత్రం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ మొత్తం 250 బేసిస్ పాయింట్లు రెపో రేటు పెంచింది. దీని వల్ల అప్పట్లో రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగి, రుణగ్రహీతలకు భారంగా మారాయి.

ICRA చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం అమలు చేస్తున్న GST సంస్కరణలు అక్టోబర్-నవంబర్ 2025లో తాత్కాలికంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు. అయితే, ఆ తర్వాత మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరుగుదల కారణంగా ధరలపై ఒత్తిడి రావొచ్చని ఆమె హెచ్చరించారు. అందువల్ల ఈ సమావేశంలో రెపో రేటు స్థిరంగానే ఉంచే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో దీపావళి పండుగ సమీపిస్తున్న దృష్ట్యా వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్బీఐ చిన్న స్థాయిలో రేటు కోత విధించవచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మార్కెట్ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వగలదని అంచనా వేస్తున్నారు.
నువామా అనే బ్రోకరేజ్ సంస్థ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి రెపో రేటు తగ్గింపుకు అనుకూలంగా ఉంది. బలహీనమైన డిమాండ్, అధిక దిగుమతి సుంకాలు, తక్కువ ద్రవ్యోల్బణం MPCకి రేటు కోతకు అవకాశం ఇస్తున్నాయి. అయితే GST సంస్కరణల ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే MPC నిర్ణయం తీసుకోవచ్చని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, గ్లోబల్ ఆర్థిక వాతావరణం కూడా ఆర్బీఐ నిర్ణయంపై ప్రభావం చూపవచ్చు. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చనే భయం కూడా MPC ముందు ఉన్న కీలక సవాల్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అక్టోబర్ 1న గవర్నర్ ప్రకటించే నిర్ణయం రాబోయే నెలల్లో రుణగ్రహీతలు, వ్యాపారాలు, పెట్టుబడిదారులందరికీ కీలక మార్గదర్శకంగా మారనుంది.


Click it and Unblock the Notifications