కరోనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత రెండేళ్లుగా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. గత నెలలో అత్యవసరంగా 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రుణాలపై వడ్డీ రేటు పెంచడం ద్వారా రుణగ్రహీతలపై భారం పెరుగుతుంది. అదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ పెరగడం వల్ల డిపాజిటర్లకు కాస్త ఊరట కలుగుతుంది. రేపటి నుండి ఆర్బీఐ పరపతి సమీక్షా సమావేశం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈసారి వడ్డీ రేటు ఎంత పెంచుతుందనే సంధిగ్ధత అందరిలోను నెలకొన్నది.
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మళ్లీ రెపో రేటును పెంచవచ్చునని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశముందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మున్ముందు వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత సమావేశంలోనే చెప్పారు. కాబట్టి ఈసారి కూడా వడ్డీ రేట్ల పెంపు అనివార్యంగా మారింది. ఈసారి సమీక్షలో 35 నుండి 40 బేసిస్ పాయింట్లు పెంచినా, 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపో రేటు 5.15 శాతానికి చేరే అవకాశముంది.

నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిస్ పాయింట్ల మేరకు పెంచి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను తగ్గించడం ద్వారా, ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నించవచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. క్రితంసారి నగదు నిల్వల నిష్పత్తిని 0.50 శాతం పెంచింది. దీంతో రూ.87వేల కోట్ల నగదు ప్రవాహం వ్యవస్థలోకి వచ్చింది. ద్రవ్యోల్భణ ఆందోళనల నేపథ్యంలో వచ్చే మూడు నాలుగు పరపతి సమీక్ష సమావేశాల్లో వడ్డీ రేటును 1 శాతం అంతకంటే ఎక్కువగా పెంచే అవకాశముంది.
క్రితంసారి 40 బేసిస్ పాయింట్లు పెంచగా, ఇప్పుడు మరో 40 బేసిస్ పాయింట్లు, ఆగస్ట్‌లో 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం కనిపిస్తుంది. రెపో రేటు పెరిగితే హోమ్ లోన్ సహా వివిధ రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుందని అంటున్నారు.
వచ్చే ఎంపీసీ సమావేశంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచినా ఆశ్చర్యం లేదని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి అంటున్నారు. 25 నుండి 35 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ అన్నారు. జూన్ పాలసీ సమావేశంలో ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఆర్థికవేత్త సువోదీప్ రక్షిత్ అన్నారు


Click it and Unblock the Notifications