Repo Rate Remains Unchanged: మూడు రోజుల పాటు సాగిన RBI ద్రవ్య విధాన సమావేశం నేటితో ముగియనుంది. ఈ రోజు ముంబయిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ఈ రోజు సమావేశంలో సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. రెపో రేటులో మార్పు లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 5.5 శాతపు రెపో రేటునే కొనసాగించాలని RBI నిర్ణయించిందని తెలిపారు. ఇదే సమయంలో.. ద్రవ్య విధాన వైఖరి విషయంలో కూడా RBI తటస్థ (neutral) దృక్పథాన్ని కొనసాగించబోతోందని స్పష్టం చేశారు.
ఆగస్టు 4 నుంచి 6 వరకు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం.. గవర్నర్ ప్రకటించిన వివరాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపే అంశాలుగా నిలవబోతున్నాయి. గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరిస్థితుల ప్రభావం, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన దిగుమతి సుంకాల విధానం వాణిజ్య రంగంలో అనిశ్చితిని పెంచిందని తెలిపారు.అందువల్ల RBI దశల వారీగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ముందుంటుందని చెప్పారు.

ద్రవ్యోల్బణ పరిస్థితి మెరుగవుతోందన్నప్పటికీ.. అది ఇంకా పూర్తిగా లక్ష్య స్థాయికి చేరలేదని సంజయ్ తెలిపారు. జూన్‌లో MPC ఆశించినదానికంటే ఎక్కువగా 50 బేసిస్ పాయింట్లు ప్రకటన చేశామని ఆ ప్రభావం ఇంకా నిలిచే అవకాశముందని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. రెపో రేటును తక్షణమే తగ్గించే అవసరం లేదని.. తగిన సమయంలో మాత్రమే దశలవారీగా తగ్గించడం మేలని ఆయన అంటున్నారు.
FY26 ద్రవ్యోల్బణ అంచనా విషయానికి వస్తే.. ఈ సమావేశంలో దానిని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాలో మార్పు లేకపోవడం వల్ల అదే స్థాయిలో కొనసాగుతుందని RBI అంచనా వేసింది.
రెపో రేటు అంటే ఏమిటి: వాణిజ్య బ్యాంకులు RBI నుండి రుణంగా తీసుకునే డబ్బుపై చెల్లించే వడ్డీ. ఈ రేటు తగ్గితే సాధారణంగా బ్యాంకులు కూడా ప్రజలకు ఇస్తున్న రుణాలపై వడ్డీని తగ్గిస్తాయి. ఫలితంగా.. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి ఆర్థిక వ్యవస్థలో డబ్బు కనిపిస్తుంది. ఇక రివర్స్ రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు తమ అదనపు డబ్బును RBI వద్ద నిల్వచేస్తే, వారు పొందే వడ్డీ రేటు. ఈ సమీక్షలో రెపో రేటు మార్చకపోవడం వల్ల.. తాత్కాలికంగా వడ్డీ రేటుల్లో మార్పు రాకపోవచ్చు. రుణాల వడ్డీపై కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications