ఈ శుక్రవారం ఏం జరగబోతోంది? RBI మీటింగ్‌పైనే అందరి కళ్లు.. అసలు మ్యాటర్ ఇదే!
దేశంలో లోన్లు ఉన్నవారైనా, సామాన్య ప్రజలైనా ఇప్పుడు ఈ ఒక్క విషయం గురించే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే ఆర్బీఐ (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయం. బుధవారం ప్రారంభమైన ఈ మూడు రోజుల కీలక సమావేశం ముగిశాక, శుక్రవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వడ్డీ రేట్ల కంటే కూడా దేశ ఆర్థిక వృద్ధి, రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఎలా ఉండబోతుందనే దానిపై గవర్నర్ చేసే కామెంట్స్ కోసం ఇన్వెస్టర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ముడిచమురు సెగ.. దిగుమతి అవుతున్న ద్రవ్యోల్బణం
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో (West Asia) పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మన దేశానికి కావలసిన ముడిచమురులో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. కాబట్టి అక్కడ ధరలు పెరిగితే ఆ ఎఫెక్ట్ నేరుగా మన దేశంలో రవాణా, తయారీ రంగాలు , ఆహార పదార్థాల ధరలపై పడుతుంది.
ఆర్థిక వృద్ధిపై నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి?
కేర్ ఎడ్జ్ రేటింగ్స్ (CareEdge Ratings) నివేదిక ప్రకారం.. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల వరకు ఉంటే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY27) 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగలదు. కానీ, గ్లోబల్ టెన్షన్స్ ఎక్కువై క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లకు చేరితే మాత్రం ఈ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది.
మరోపక్క ఎస్‌బీఐ రీసెర్చ్ (SBI Research) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాబోయే కొన్ని త్రైమాసికాల వరకు వినియోగదారుల ద్రవ్యోల్బణం 5 శాతం కంటే పైనే ఉండే అవకాశం ఉందని, అందుకే ఆర్బీఐ వడ్డీ రేట్లను ఇప్పుడప్పుడే తగ్గించకపోవచ్చని అభిప్రాయపడింది.
లిక్విడిటీ, క్రెడిట్ గ్రోత్‌పై నజర్
వడ్డీ రేట్లతో పాటు మార్కెట్లో డబ్బు లభ్యత (లిక్విడిటీ), బ్యాంకుల లోన్ గ్రోత్ రేట్, గతంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లాయి అనే విషయాలను కూడా ఆర్బీఐ పరిశీలించనుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి అనే దానికి ఈ సమావేశంలో వచ్చే హింట్స్ చాలా కీలకం కానున్నాయి.
ఇక సామాన్యుల విషయానికి వస్తే, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం అనేది ఒక రకంగా ఊరట కలిగించే విషయమే అయినా, గృహ, వాహన రుణాల ఈఎంఐలు (EMIs) ఇప్పుడప్పుడే తగ్గే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో రుతుపవనాలు (Monsoons) సకాలంలో రాకపోతే ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఆర్బీఐ ఈ సారి కేవలం వడ్డీ రేట్లపైనే కాకుండా, మార్కెట్లో రూపాయి విలువను కాపాడటం మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంపైనే పూర్తి ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాబోయే ఆర్బీఐ గవర్నర్ ప్రకటన మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారబోతోంది.


Click it and Unblock the Notifications