RBI News: ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనున్న RBI.. తగ్గనున్న EMIల భారం
Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఇండియాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. దీంతో మరుసటి ద్రవ్య పరపతి సమావేశంలో RBI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్టోబర్ 2024లో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను సమీక్షించనుంది. అప్పుడు ఖరీదైన EMIల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 2023 నుంచి రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ టార్గెట్‌కు అనుగుణంగా ద్రవ్యోల్బణం నమోదు కావడంతో వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.

వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం RBI లక్ష్యమైన 4 శాతానికి తగ్గడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. దీంతో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటులో కోత విధించినట్లయితే, అందుకు అనుగుణంగా సాధారణ ప్రజలు నెలవారీ వాయిదాలు కూడా తగ్గుతాయి. రానున్న ద్రవ్య విధాన సమీక్షలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. పాలసీ రేటును నిర్ణయించేటప్పుడు అనేక ఆర్థిక సూచికలతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాను కూడా RBI పరిగణనలోకి తీసుకుంటుంది. అది పెరిగినప్పుడు వడ్డీ రేట్లను పెంచడం, తగ్గినప్పుడు తగ్గించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
ఆగస్టు 8 2024న జరిగిన ద్రవ్య సమీక్షలో వరుసగా తొమ్మిదోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని RBI నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మీటింగ్‌లో రేట్ల తగ్గింపు గురించి సెంట్రల్ బ్యాంక్‌పై ఒత్తిడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ మేరకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ఎక్కువగా పంటలు వేయడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం కూడా దారిలోకి వస్తుందని భావిస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశమూ లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications