RBI Rate Hike: వచ్చే నెల మెుదటి వారంలో రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశం శక్తికాంత దాస్ నేతృత్వంలో జరగబోతోంది. ఏప్రిల్ 3, 5, 6 తారీఖుల్లో జరగనున్న ఈ ద్రవ్య పరపతి కమిటీ సమావేశంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉంటాయోనని వ్యాపారులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ద్రవ్యోల్బణం కారణంగా..
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి RBI గత ఏడాది కాలంగా రెపో రేటును నిరంతరం పెంచుతూ వచ్చింది. దీంతో వడ్డీ రేటు ఏకంగా 6.50 శాతానికి చేరుకుంది. RBI 2022లో వడ్డీ రేట్లను ఏకంగా 5 సార్లు పెంచింది. కొత్త ఏడాది ఈ పెంపులు ఒక కొలిక్కి వస్తాయని అందరూ భావించినప్పటికీ.. అలా జరిగే అవకాశం ఇప్పట్లో కనిపించటం లేదని తెలుస్తోంది. ఇటీవల ఫెడ్ చైర్మన్ పావెల్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు.

యూఎస్ వెనక్కి తగ్గుతుందా..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినందున అక్కడి బ్యాంకింగ్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్రమంలో ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలటంతో ఫెడ్ తన రేట్ల పెంపును నిలిపివేయవచ్చని అందరూ భావిస్తున్నారు. రేట్ల పెంపు విషయంలో అమెరికాను అనుకరించటం సరికాదని ఇటీవల రిజర్వు బ్యాంక్ సభ్యులు ఒకరు వ్యాఖ్యానించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఈ క్రమంలో వచ్చే నెల ఎంపీసీ సమావేశం చాలా కీలకంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేటు పెంపును ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రుణాలు తీసుకునే వారిలో, ఇప్పటికే హౌసింగ్ లోన్స్ తీసుకున్న వారిలో భయాన్ని పెంచుతోంది. అమెరికా వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఇండియా ముందుకు సాగాలనుకోవటం ఆందోళనను పెంచుతోంది.


Click it and Unblock the Notifications