RBI News: ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరంపై అందరూ కోటి ఆశలతో ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పుడు దేశీయ ఇన్వెస్టర్ల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరి చూపు రెపో రేటు విషయంలో రిజర్వు బ్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపైనే ఉంది.
రేటు పెంపు విషయంలో దేశంలోని ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం ఎంపీసీలో పాల్గొనే ఎకనమిస్టులు ఈ సారి రెపో రేటును పావుశాతం అంటే 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని భావిస్తున్నారు. దీంతో రెపో రేటు 6.75 శాతానికి చేరుకుంటుంది. ఇదే క్రమంలో మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈసారి ఎంపీసీలో ఎటువంటి వడ్డీ రేట్ల ప్రకటన ఉండదని.. ఈ సారికి రేట్ల పెంపు నిలిచిపోతుందని అంటున్నారు.

ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో రిజర్వు బ్యాంక్ విజయం సాధించలేదు. జనవరిలో 6.52 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి ఫిబ్రవరిలో 6.44 శాతానికి చేరుకుంది. ఇది ఇప్పటికీ సెంట్రల్ బ్యాంక్ నిర్థేశించుకున్న 6 శాతం కంటే ఇంకా ఎక్కువగానే కొనసాగుతోంది. ఇదే క్రమంలో ప్రధాన ద్రవ్యోల్బణం అధికంగా కొనసాగటంపై మెజారిటీ ఎంపీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేట్ల పెంపు ఆగుతుంది అని భావించటం అపోహేనని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా ద్రవ్యోల్బణం అదుపులోకి రాకుండా ఉన్నందున గత సమావేశంలో రేటు పెంపును నిలిపివేయాలని ప్రతిపాధించిన సభ్యులు జయంత్ వర్మ, అషిమా గోయల్ ఈ సారి అలాంటి ప్రయత్నం చేయరని తెలుస్తోంది. వరుసగా ద్రవ్యోల్బణం మూడు త్రైమాసికాలు 6 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిపై MPC కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని నమ్మకం కలిగే వరకు చర్యలు కఠినంగానే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications