అధిక ద్రవ్యోల్భణం, జూన్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చు
అధిక ద్రవ్యోల్భణం నేపథ్యంలో రాబోయే జూన్ సమావేశంలో పాలసీ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్భణం ఈ ఏడాది మూడోసారి ఆర్బీఐ గరిష్టస్థాయి ఆరు శాతాన్ని దాటింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా ఇంధన ధరలు పెరిగితే సెప్టెంబర్ వరకు ద్రవ్యోల్భణం ఏడు శాతానికి దగ్గరగా ఉంటుందని కొంతమంది ఆర్థికవేత్తలు అంచనా వేయడంతో, ఇప్పటికే ఉన్న అధిక ఆహార ధరలు, ఇంధన ధరలు ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ పరపతి సమీక్షా సమావేశంలో పెంపు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే జూన్‌లోనే ఉండవచ్చునని తాజాగా భావిస్తున్నారు.
ఇక నుండి వృద్ధి కంటే ద్రవ్యోల్బణంపై తమ దృష్టి ఉంటుందని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో వడ్డీ రేట్లపెంపును ప్రారంభిస్తుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో పలు రేటింగ్ ఏజెన్సీలు, బ్రోకరేజ్ సంస్థలు ఈ అంచనాలను వెలువరించాయి. జూన్ సమీక్షలో ఆర్బీఐ కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచవచ్చునని తాజాగా ఎస్బీఐకి చెందిన ఎకోరాప్ నివేదిక పేర్కొంది.

గతవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. జూన్ సమీక్షలో 25 బేసిస్ పాయింట్లు, ఆగస్ట్ నెలలో మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ వడ్డిస్తుందని, మొత్తానికి ఈ రేట్ల పెంపు సైకిల్‌లో 75 బేసిస్ పాయింట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆహారోత్పత్తుల ధరలు కొండెక్కడంతో మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతానికి చేరిందని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొంది.


Click it and Unblock the Notifications