డిమాండ్ పెంచేందుకు మరిన్ని చర్యలు, వడ్డీ రేట్లు మరింత తగ్గింపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, డిమాండ్‌ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కూడా తదుపరి మానిటరీ పాలసీలో భాగంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో డిమాండ్ మరింత పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

వడ్డీ తగ్గింపు, ఆర్థిక రూపంలోనూ
ఇందులో భాగంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చునని చెప్పారు సన్యాల్. ఇప్పటికే ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించిందని, ఇందులో ఎక్కువగా డిమాండ్ పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలే అన్నారు. ముందు ముందు కూడా వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు ఆర్థిక రూపంలో మరిన్ని చర్యలు ఉంటాయని చెప్పారు. వడ్డీరేట్లు ఇంకా తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.

అక్కడ వడ్డీ రేట్లు జీరో శాతానికి
ఇప్పటికే పలు దేశాల్లో వడ్డీ రేట్లు జీరో శాతానికి పడిపోయాయాయి. పశ్చిమ యూరోప్ వంటి కొన్ని దేశాల్లో ప్రతికూల వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మన వద్ద కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేకపోలేదన్నారు. జీడీపీతో పోలిస్తే రుణాల శాతం అమెరికా, బ్రిటిన్ సహా ఇతర దేశాల కంటే మన వద్ద తక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం కూడా చేయవచ్చునన్నారు.

లాక్ డౌన్ సమయంలో ప్రయోజనం లేదు
లాక్ డౌన్ సమయంలో డిమాండ్ పెంచేందుకు ఏ చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదని, అన్-లాక్ ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో దశలవారీగా చర్యలు ఉంటాయని చెప్పారు. వ్యవసాయం, వర్కర్స్ గురించి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నదని, సప్లై చైన్ కోసం సంస్కరణలు తీసుకు వచ్చిందన్నారు. క్రమంగా డిమాండ్ పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications