2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత 2000 నోట్ల పరిస్థితి ఏంటి..?? RBI ప్లాన్ అదేనా..??
2000 Notes: 2000 రూపాయల నోట్లను దేశంలో చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీనిని లీగల్ టెండర్ గా పరిగణిస్తామని చెప్పినప్పటికీ.. సెప్టెంబర్ చివరినాటికి బ్యాంకుల్లో మార్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో వరుస సెలవులు బ్యాంకులకు వస్తుండగా చాలా మంది నేడు తమ సమీప బ్యాంకుల్లో 2000 నోట్లను మార్చుకుంటున్నారు. అక్టోబర్ 1 నుంచి మార్చుకోని వారు వీటిని ఏం చేయాలనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఆగస్టు 31, 2023 నాటికి దేశంలోని బ్యాంకులకు రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. అలాగే రూ.0.24 లక్షల కోట్లు విలువైన నోట్లు ఇంకా చెలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.

అయితే గడువు ముగుస్తున్న వేళ వీటిని ఏం చేయాలనే దానిపై అక్టోబర్ 1న రిజర్వు బ్యాంక్ కీలక ప్రకటన విడుదల చేయొచ్చని చాలా మంది భావిస్తున్నారు. క్లీన్ నోట్ పాలసీ కింద పెద్ద నోట్లను ఇప్పటికే వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీని కింద 93 శాతం రూ.2000 నోట్లు తిరిగి బ్యాంకులకు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును మరో నెలపాటు పొడిగించి అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించవచ్చని దీని గురించి తెలిసిన ఒక అధికారి ప్రముఖ వార్తా సంస్థకు తెలిపారు. ప్రధానంగా విదేశాల్లో నివశిస్తున్న ప్రవాస భారతీయుల కోసం ఈ సారి పొడిగింపు ఉంటుందని ఆయన తెలిపారు. మే 19, 2023లో రిజర్వు బ్యాంక్ ప్రకటన తర్వాత చాలా మంది తమ వద్ద ఉన్న నోట్లను తమ బ్యాంక్ ఖాతాల్లో జమచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడువు పొడిగింపు కరెన్సీ నోట్ల ఉపసంహరణను వీలైనంత మేర 100 శాతానికి చేరువ చేసే లక్ష్యంతో ఉంటుందని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications