మళ్లీ రెపోరేటు తగ్గింపు, రుణాలు మరింత చవక? ఆర్థిక వ్యవస్థకు లాభంలేదా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో దఫా వడ్డీ రేటు తగ్గించవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ రంగాల్లో తగ్గిన డిమాండ్, ఆర్థిక మందగమన ప్రభావం, జీడీపీ మందగించడం నేపథ్యంలో ఆర్బీఐ డిసెంబర్ ద్రవ్య సమీక్ష సందర్భంగా కూడా రెపోరేటును మరో 25 పాయింట్లు తగ్గించవచ్చునని భావిస్తున్నారు. రూటర్స్ పోల్‌లో ఎకనమిస్ట్‌లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

4.90 శాతానికి తగ్గే ఛాన్స్
ఈ ఏడాది ఆర్బీఐ వరుసగా రెపో రేటును తగ్గిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 5.15 శాతానికి దిగి వచ్చింది. గత ఐదు ద్రవ్య సమీక్షల్లో 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఇప్పుడు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే 4.90 శాతానికి వస్తుంది. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అదే జరిగితే లోన్ పైన వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయి.

ఆ తర్వాత క్వార్టర్లోను తగ్గవచ్చు...
డిసెంబర్‌లో జరిగే ద్రవ్యసమీక్షలో కూడా రెపో రేటు తగ్గితే వరుసగా ఆరు ద్రవ్య సమీక్షల్లో వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినట్లవుతుంది. 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే గత 135 పాయింట్లకు ఇవి కలిస్తే మొత్తంగా ఈ ఏడాది 160 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లుగా అవుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే తదుపరి క్వార్టర్‌లోను (2020) 15 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చునని, అప్పుడు రెపో రేటు 4.75 శాతానికి తగ్గుతుందని, ఇది 2021 వరకు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేనా?
మరింత రుణ రేటు తగ్గింపు ఆర్థిక వ్యవస్థపై పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపుతుందని, ఎందుకంటే రుణాలు తీసుకునేది ఇక్కడ కీలక సమస్య కాదని, కొనుగోళ్లు, పెట్టుబడులే అసలు సమస్య అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరో కారణం కూడా ఉందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఊరట దక్కడం లేదని, ఇందుకు మరో కారణం ఆర్బీఐతో సమానంగా రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించకపోవడమే అంటున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్దగా అండగా ఉండేదేమీ కాదని, వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలంటున్నారు.


Click it and Unblock the Notifications