Banking news: రెండు బ్యాంకులు, ఓ NBFCకి RBI ఝలక్.. భారీగా జరిమానా విధింపు.. ఏమైందంటే..
Banking news: ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్(NBFC) వంటి ఆర్థిక సంస్థలపై జరిమానా విధిస్తుంది. తాజాగా రెండు బ్యాంకులు, మరో NBFCకి RBI షాక్ ఇచ్చింది.
రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు గాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBL బ్యాంక్ మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. రుణాలు మరియు అడ్వాన్స్‌ల చట్టబద్ధమైన పరిమితులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు UBIకి రూ. కోటి పెనాల్టీ వేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో షేర్లు లేదా ఓటింగ్ హక్కులను పొందేందుకు ముందస్తు అనుమతికి సంబంధించిన RBI ఆదేశాలు పాటించడంలో RBL విఫలమైంది. దీంతో ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంకుపై 64 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. RBI ఆదేశాల్లోని NBFC నిబంధనల ప్రకారం మోసాలను పర్యవేక్షించనందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై 8.5 లక్షల ఫైన్ వేసినట్లు పేర్కొంది.
తమ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని RBI హెచ్చరించింది. ఆయా ఎంటీటీల అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపింది. ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తుచేసింది.


Click it and Unblock the Notifications