RBI News: రూటు మార్చిన ఆర్బీఐ.. ఈసారి వీసా, మాస్టర్ కార్డులకు సడన్ స్ట్రోక్
Card payments: ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు పలు సంస్థలకు భారంగా మారాయి. అయితే ప్రజా ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తప్పవని సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. ఫిన్ టెక్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై ఇప్పటివరకు ఆంక్షలు విధిస్తూ వచ్చిన RBI.. తాజాగా రూట్ మార్చింది.
మాస్టర్ మరియు వీసా కార్డుల ద్వారా కంపెనీలు చేసే వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. ఫిబ్రవరి 8న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. తదుపరి నోటీసు ఇచ్చేవరకు అన్ని బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్(BPSP) ఈ తరహా లావాదేవీలను హోల్డ్ చేయాలని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీచేసింది.

'వాణిజ్య మరియు వ్యాపార చెల్లింపులలో BPSPల పాత్రపై సమాచారం ఇవ్వాలంటూ ఇండస్ట్రీలోని అందరికీ ఆర్బీఐ నుంచి మెయిల్స్ వెళ్లాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 8, గురువారం సెంట్రల్ బ్యాంక్ నుంచి మాకు కమ్యూనికేషన్ అందింది. అన్ని BPSP లావాదేవీలను నిలిపివేయాలని మాకు సూచించింది' అని వీసా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై కొందరు బ్యాంకర్లు RBIని సంప్రదించినట్లు నివేదికలు తెలిపాయి.
పలు కంపెనీలు సాధారణంగా నెట్ బ్యాంకింగ్ లేదా RTGS ద్వారా చెల్లింపులు చేస్తుంంటాయి. అయితే ఎంకాష్, కార్బన్ మరియు పేమేట్ వంటి కొన్ని ఫిన్‌టెక్‌లు.. సరఫరాదారులు మరియు విక్రేతలకు పేమెంట్స్ కోసం కార్డ్‌ల ద్వారా చెల్లింపులను సులభతరం చేశాయి. అయితే ఈ తరహా పేమెంట్స్ నెలవారీ పరిమాణం 20 వేల కోట్లకు మించి ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఈ చర్యలకు గల కారణాన్ని RBI వెల్లడించలేదు. కానీ KYC పూర్తికాని వ్యాపారులకు కార్డ్ మార్గం ద్వారా డబ్బు ప్రవహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వ్యవహారం నియంత్రణ సంస్థకు చికాకు కలిగించిందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. కొన్ని అధిక విలువైన లావాదేవీలలో మోసం లేదా మనీలాండరింగ్ అనుమానాలు కూడా ఈ చర్యకు దారితీశాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications