ఆ బ్యాంకుల్లో లావాదేవీలు నిలిపేసిన RBI.. వాటిలో అకౌంట్ ఉంటే త్వరపడండి..
RBI Restrictions: ఖాతాదారులకు బ్యాంకులు మెరుగైన సేవలందించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. నిబంధనలు పాటించని ఆర్థిక సంస్థలపై కొరడా ఝళిపిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. తాజాగా రెండు బ్యాంకులపై RBI చర్యలకు ఉపక్రమించింది.
అజంతా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మరియు పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఆగస్ట్ 29 నుంచి ఇవి వర్తిస్తాయని RBI తెలిపింది. ఈ ఆదేశాలు 6 నెలలపాటు అమల్లో ఉంటాయని వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఆర్డర్స్ కాపీని ప్రజల పరిశీలనార్థం బ్యాంకుల్లోను, వాటి వెబ్ సైట్స్ లో ప్రదర్శించాలని ఆదేశించింది.

'ఈ సమయంలో ఆయా బ్యాంకులకు ఎటువంటి రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసే, పునరుద్ధరించే అవకాశం ఉండదు. ఇన్వెస్ట్ మెంట్స్, డిపాజిట్లు అంగీకరించడం సహా ఇతర విధులకు దూరంగా ఉంటాయి. ఏవిధమైన చెల్లింపులనూ చేసే అధికారం ఉండదు. ఆస్తులను విక్రయించడం, బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు' అని RBI తెలిపింది.
ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేంత వరకు తమ ఆదేశాలను పాటించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఆంక్షలకు లోబడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించింది. తమ నుంచి ముందస్తు అనుమతి లేకుండా పైన పేర్కొన్న చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. అయితే ఖాతాదారులు డిపాజిట్ ఇన్యూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి 5 లక్షల వరకు డిపాజిట్లు క్లెయిమ్ చేయవచ్చని ప్రకటించింది.


Click it and Unblock the Notifications