Monitory Policy: మానిటరీ పాలసీ నిర్వహణపై RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. కార్ డ్రైవింగ్‌తో పోలిక
Monitory Policy: ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ దేశాలు నేలచూపులు చూస్తున్న వేళ.. ఇండియా మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఏకంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా నుంచి మూడవ స్థానానికి ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇందుకు ఆటంకం కలిగిస్తున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోనున్నట్లు RBI గవర్నర్ తెలిపారు.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(DSE) డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో దాస్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'ఆర్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ మేకింగ్: ది ఇండియన్ కాంటెక్స్ట్' మీద మాట్లాడారు. కొవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెరసి ద్రవ్య విధాన నిర్వహణలో సవాళ్లను లేవనెత్తాయని అభిప్రాయపడ్డారు. తద్వారా సరఫరా గొలుసులో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేందుకు RBI సిద్ధంగా ఉందన్నారు.

జూన్‌లో 4.81 శాతం ఉన్న కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ద్రవ్యోల్బణం జూలైలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44ని తాకడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరుగుదల ఇందుకు కారణమన్నారు. సెప్టెంబర్ 2022 నుంచి తరచుగా ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. దీనిని ఎదుర్కొనేందుకు తాము అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు.
ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ దృఢంగా దృష్టి సారించిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం సమస్యలకు దారితీస్తుందన్నారు. ద్రవ్యవిధానం ఎప్పుడూ ముందుచూపుతో ఉండాలని అభిప్రాయపడ్డారు. మానిటరీ పాలసీ నిర్వహణలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లకు సరైన సమయంలో స్పందించకపోతే ప్రమాదం జరుగుతుందన్నారు.
RBI వివేకవంతమైన ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరిస్తోందని RBI గవర్నర్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ద్రవ్యోల్బణం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగపరచడంపై విస్తృత లక్ష్యాలతో పనిచేస్తోందన్నారు. బ్యాంకులు, NBFCలు సహా ఇతర ఆర్థిక సంస్థల నియంత్రణ, పర్యవేక్షణను సమన్వయం చేసుకుంటూ వాటిని అభివృద్ధి బాటలో నడిపించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications