RBI Governor: చెన్నై ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ఏమైందంటే..?
Shaktikanta Das Hospitalised: భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు ఆసుపత్రిలో చేరారు. ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాస్ కొన్ని అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన అపోలోలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. అయితే రానున్న 2-3 గంటల్లో డిస్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిజర్వు బ్యాంక్ ప్రతినిధి దీనిపై స్పందిస్తూ శక్తికాంత దాస్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసిడిటీ కారణంగా ఏర్పడిన స్వల్ప అనారోగ్యం వల్ల దాస్ ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. పెద్దగా అనారోగ్యం కానందున కొన్ని గంటల చికిత్స తర్వాత దాస్ తిరిగి సాధారణ కార్యక్రమాలను చేపడతారని తెలుస్తోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలోని అపోలో ఆసుపత్రి వర్గాలు సైతం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గవర్నర్ దాస్ కొన్ని గంటల్లోనే సాధారణ ఆరోగ్య స్థితికి వచ్చేందుకు అవసరమైన మెడికేషన్ అక్కడి బృందం అందిస్తున్నట్లు సమాచారం. అయితే హటాత్తుగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బాస్ అనారోగ్యానికి గురికావటం గురించి వార్తా కథనాలు రావటంతో కొందరు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాదని రిజర్వు బ్యాంక్ ప్రతినిధులు మీడియాకు స్పష్టతను అందించారు.
కొన్ని వార్తా సంస్థల్లో ప్రచురించిన నివేదిక ప్రకారం గవర్నర్ శక్తికాంత దాస్ గుండె పోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించటంతో వెంటనే ఆసుపత్రికి తరలించబడినట్లు వెల్లడైంది. అయితే ఇది అసిడిటీ వల్ల వచ్చిన సమస్యా లేక నిజంగానే గుండెపోటు వచ్చిందా అనే విషయాన్ని ఇంకా అపోలో హాస్పిటల్ వర్గాలు ధృవీకరించలేదు. అయితే ప్రస్తుతం ఆయనకు ప్రాథమిక ఆరోగ్య చికిత్స అందిస్తున్నట్లు, కొన్ని గంటల్లోనే ఆయన తిరిగి డిస్ఛార్జ్ అవుతారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications