RBI News: వాతావరణ రిపోర్టుతో RBI గవర్నర్ ఆందోళన.. కూరగాయల ధరలపై నిఘా పెట్టాలని సూచన..
Vegetable Prices: దేశంలో వేసవి కాలం మెుదలైంది. ప్రారంభం నుంచి ఎండ వేడిమి, వడగాలులతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎండ తీవ్రతకు ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ శాఖ అంచనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి.
అయితే వాతావరణ శాఖ అధిక వేడి వాతావరణ అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దీనిపై ప్రస్థావిస్తూ.. ఈ వేసవిలో కూరగాయల ధరలను మనం గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన అనంతరం దాస్ విలేకరులతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం రేటును ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు శాతానికి తగ్గించడమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యమని అన్నారు. అయితే జూన్ వరకు దేశంలో వేడి గాలులు వీస్తాయని ఐఎండి అంచనాలతో ప్రధాన కూరగాయల ధరలు పెరగొచ్చని అన్నారు.

అయితే గోధుమలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్వాసం వ్యక్తం చేస్తూ చాలా వరకు కోతలు పూర్తయ్యాయని తెలిపారు. అయితే కూరగాయల ధరలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని దాస్ పేర్కొన్నారు. వీటి కారణంగా వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుడ్లు, మాంసం, చేపలు, బియ్యం వంటి వస్తువులు కూడా ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చాయని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర అన్నారు.
ఇది కాకుండా ఇటీవలి కాలంలో ధాన్యాలు, కూరగాయల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. దీనికి ముందు రోజు గవర్నర్ తన ప్రకటనలో ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ లక్ష్యం ఇప్పుడు కనుచూపుమేరలో ఉందని ధరల పెరుగుదలపై ప్రతి ఒక్కరూ తమ అప్రమత్తతను కోల్పోవద్దని ఆయన కోరారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా ఉంటే.. వరుసగా నాల్గవ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని దాస్ చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అధికారిక వృద్ధి గణాంకాలను మేలో విడుదల చేసిన తర్వాత RBI సంభావ్య వృద్ధి, వాస్తవ వడ్డీ రేట్లను పరిశీలిస్తుందని దాస్ చెప్పారు. అయితే వచ్చే దశాబ్దంలో ఆర్‌బిఐ ఆర్థిక రంగ స్థిరత్వంపై దృష్టి సారిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications