Homeloans: హోమ్‌లోన్స్‌పై RBI కొత్త ఫ్రేమ్‌వర్క్.. ఇకపై బ్యాంకుల ఆటలు సాగవు..
Homeloans: ఆర్థిక అవసరాల దృష్ట్యా వివిధ రకాల రుణాలు తీసుకుంటూ ఉంటాం. అయితే హోమ్ లోన్ మిగతా వాటన్నిటికంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువకాలం పాటు ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు రుణగ్రహీతలకు తెలియకుండానే ఆర్థిక సంస్థలు EMI లేదా టెన్యూర్ పెంచడం వంటివి చేస్తుంటాయి.
ఈ తరహా మార్పులకు వ్యతిరేకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది. ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, EMIలలో పారదర్శకత కోసం ఓ ఫ్రేమ్ వర్క్ ను ప్రతిపాదించింది. తద్వారా రుణగ్రహీత సమ్మతి లేకుండా కాలవ్యవధి, EMIలలో ఇకపై ఆర్థిక సంస్థలు మార్పులు చేసే అవకాశం ఉండదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

RBI గవర్నర్ ప్రకటన ప్రకారం.. ప్రతిపాదిత ఫ్రేమ్ వర్క్ అమల్లోకి వస్తే రుణ గ్రహీతలకు మెరుగైన సేవలు అందుతాయి. రుణాల రీషెడ్యూల్, EMIల పరిమాణంలో ఏవైనా మార్పులు చేయాల్సివస్తే.. ఆ విషయాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తప్పకుండా రుణగ్రహీతలకు తెలియచేయాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్-రేట్ లోన్‌లు లేదా ఫోర్ క్లోజర్ కోసం ఆప్షన్ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన ఛార్జీలను సైతం స్పష్టంగా వివరించాలి.
తాజా ఫ్రేమ్ వర్క్ ప్రతిపాదించడానికి ముఖ్య కారణం అధిక కాల వ్యవధి కలిగిన లోన్లేనని RBI గవర్నర్ తెలిపారు. ఫ్లోటింగ్ రేట్ రుణాలపై బ్యాంకులు, వాటి బోర్డులు నిర్ణయం తీసుకునేటప్పుడు దీనిని పరిగణలోనికి తీసుకోవాల్సి అవసరం ఉందన్నారు. రుణాల పొడిగింపు సహేతుకమైన వ్యవధిలో ఉండే విధంగా చూడాలని సూచించారు.


Click it and Unblock the Notifications