Raghuram Rajan: ఎంపీగా బరిలోకి రఘురామ్ రాజన్..! ఎక్కడి నుంచి అంటే..
Rajya Sabha Elections 2024: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇప్పటికే పలుమార్లు తన స్వరం వినిపించారు. దేశ ప్రస్తుత ప్రగతి వేగం భవిష్యత్తు అవసరాలకు సరిపోదని పలుమార్లు హెచ్చరించారు.
గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా రాజన్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఇంటర్వ్యూ చేశారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి రఘురామ్ రాజన్ రాజ్యసభకు నామినేట్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజన్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేను బాంద్రాలో కలిశారు. అప్పటి నుంచి రాజన్ కాంగ్రెస్ లేదా మహావికాస్ అఘాడీ ఉమ్మడి అభ్యర్థి కావచ్చునని చర్చలు ఊపందుకున్నాయి.

ఈ చర్చకు సంబంధించి రఘురామ్ రాజన్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తూ.. తన పర్యటనతో రాజ్యసభ సీట్లపై మీడియాలో చర్చ జరుగుతోందని, తాను ఏపార్టీతోనూ చర్చించలేదని పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని అన్నారు. అయితే ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు ముందు జరగనున్న సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. ప్రతి అభ్యర్థి గెలవడానికి కనీసం 42 అసెంబ్లీ సభ్యుల ఓట్లు అవసరం ఉంది.
కొన్నేళ్లుగా బీజేపీ మహారాష్ట్ర కేంద్రంగా చేసిన రాజకీయ అలజడిని సృష్టించింది. ప్రస్తుతం పార్టీ చీలిన తర్వాత కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా రాజన్ ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపపోవటం ఉత్కంఠకు దారితీస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఎంపీలు ప్రకాష్ జవదేకర్, అనిల్ దేశాయ్, కుమార్ కేత్కర్, వి మురళీధరన్, నారాయణ్ రాణే, వందనా చవాన్ సభ్యత్వం గడువు ఏప్రిల్ 2తో ముగుస్తోంది. రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్, ఆర్థిక వేత్త, ప్రముఖ ప్రొఫెసర్ రాజకీయ అరంగేట్రం చేస్తారా లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా అనే విషయానికి కొద్ది రోజుల్లో తెరపడనుంది.


Click it and Unblock the Notifications