Budget 2024: బడ్జెట్ ముందు నిర్మలమ్మకు రఘురామ్ రాజన్ సలహా.. ఏమన్నారంటే..?
Raghuram Rajan: మరికొన్ని రోజుల్లో దేశంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం తన మెుదటి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనిపై దేశంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు.
ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పూర్తి బడ్జెట్ 2024 కోసం పార్లమెంట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. బడ్జెట్ సమావేశాల రెండవ రోజైన జూలై 23న ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వంపై దేశంలోని యువత, రైతులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాలపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2024 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ ప్రభుత్వానికి కీలక సలహాలు ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిర ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కోసం, తయారీ రంగం విస్తరణ కంటే సేవల రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. తయారీ రంగం పరిమిత ఎగుమతులతో పాటు.. చైనా, వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో వంటి దేశాల నుంచి పోటీ వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని వార్షిక ప్రపంచ బ్యాంకు సదస్సులో మాట్లాడుతూ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా తయారీ నిచ్చెనలను అధిరోహించడం కష్టమని హెచ్చరించారు.
విద్య-ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి భారతదేశం అవసరాన్ని నొక్కిచెప్పిన రాజన్.. మెరుగైన అవకాశాలను పొందడానికి ఆవిష్కరణలు, సృజనాత్మకతను పెంపొందించడం ముఖ్యమన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొత్త ఉద్యోగాలు మరియు భవిష్యత్ ఉపాధి అవకాశాలు ఆందోళన కలిగించే అంశం కాబట్టి మరిన్ని ఉద్యోగాలు ఈ సమయంలో అవసరమని చెప్పారు. ఇదే విషయాన్ని సైతం ఇటీవల సిటీ గ్రూప్ తన నివేదికలో చెబుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లేవని చెప్పకనే చెప్పింది.
రాజన్ ప్రకారం భారత ప్రభుత్వం అన్ని స్థాయిల్లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రస్తుత ఉద్యోగ లభ్యత, భవిష్యత్ ఉపాధి అవకాశాలు రెండింటినీ నైపుణ్యం, శిక్షణ ద్వారా పరిష్కరించాలి.


Click it and Unblock the Notifications