Modi Vision: మోదీ విజన్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ దారుణ కామెంట్స్.. విద్యావ్యవస్థపై తీవ్ర ఆందోళన..
Raghuram Rajan: దేశాన్ని వృద్ధి పథంలో నడిపించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పేరు మారు మ్రోగిపోతోంది. అయితే ఇప్పటికే అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉన్న భారత్‌ను.. అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
ప్రధాని మోదీ లక్ష్యంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ఆశయం 'అర్ధంలేనిది' అంటూ విమర్శించారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి బదులు చిప్‌ల తయారీ యూనిట్ల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు.

ఇప్పటికీ దేశంలో చాలా మంది పిల్లలకు ఉన్నత పాఠశాల విద్య అందడం లేదని రాజన్ పేర్కొన్నారు. డ్రాప్-అవుట్‌ల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. కేవలం 20.5 శాతం మంది మూడో తరగతి విద్యార్థులు మాత్రమే రెండో తరగతి పాఠాలు చదవగలరని తెలిపారు. ఈ పరిస్థితుల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడం గురించి మాట్లాడటం విడ్డూరం అని అభిప్రాయపడ్డారు.
ఇండియా బలమైన ఆర్థిక వృద్ధికి సంబంధించిన విపరీత ప్రచారాన్ని విశ్వసించడం దేశ ప్రజలు చేసే గొప్ప తప్పుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ హైప్ నిజమని నిర్ధారించడానికి చాలా సంవత్సరాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచారం నిజమని ప్రజలు నమ్మాలని రాజకీయ నాయకులు కోరుకుంటున్నారన్నారు. దానికి దేశం లొంగిపోవడం తీవ్రమైన తప్పు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications