Mahindra Finance: మహీంద్రా ఫైనాన్స్ పై RBI చర్యలు.. ఇకపై అలా చేయెుద్దంటూ సీరియస్..
Mahindra Finance: ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ కంపెనీలు లోన్స్ రికవరీ కోసం ఏర్పాటు చేసుకుంటున్న ఏజంట్లు యముడిలా మారుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా తమకు కావాల్సింది కేవలం డబ్బే అన్నట్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సంఘటన మహీంద్రా ఫైనాన్స్ కంపెనీలో జరగటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సైతం దీనిపై చాలా సీరియస్ అయింది.

సంచలన ఘటన..
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంపెనీ నియమించుకున్న లోన్ రికవరీ ఏజెంట్ చేసిన పని అందరితో కంటతడి పెట్టించింది. ఇప్పుడు దీనిపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది.
అసలు జరిగింది ఇది..
సుమారు వారం రోజుల కిందట హజారీబాగ్‌లో జరిగిన ఘటనపై మహీంద్రా గ్రూప్ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా బాధాకరంగా ఉందంటూ ట్వీట్ ద్వారా ప్రకటించారు. మిథిలేష్ మెహతా అనే రైతు మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకుని ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. అయితే అతడు సమయానికి వాయిదా చెల్లించలేక పోయాడు. వికలాంగుడైన రైతు నుంచి డబ్బు వసూలు కోసం వెళ్లిన థర్డ్ పార్టీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తించాడు. గర్భవతిగా రైతు కూతురిపై ట్రాక్టర్ ఎక్కించటంతో ఆమె మృతి చెందింది.

RBI హెచ్చరిక..
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఇకపై లోన్స్ రికవరీ కోసం ఔట్‌సోర్సింగ్ లేదా థర్డ్ పార్టీ రికవరీ ఎజెంట్లను వినియోగించటం పూర్తిగా మానేయాలని ఆదేశించింది. RBI ఆదేశాల మేరకు ఇకపై కంపెనీ బయటి వ్యక్తులను లోన్స్ రికవరీ కోసం వినియోగించదు.
అధికారిక ట్వీట్..
హజారీబాగ్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మహీంద్రా ఫైనాన్స్ సీఈవో అండ్ ఎండీ అనిష్ షా చేసిన ట్వీట్‌ను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ఈ విషయంపై థర్డ్ పార్టీ ఏజెంట్ల నుంచి రికవరీ పాలసీని సమీక్షించాలని ఆనంద్ మహీంద్రా కోరారు. విచారణలో పోలీసులకు సహకరిస్తానని కూడా హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications