RBI News: దేశంలో ప్రస్తుతం ప్రజల్లో డబ్బును దాచుకోవటం కంటే రుణాలు తీసుకుంటున్న ధోరణి పెరుగుతోంది. ఇటీవల వెలువడిన అనేక నివేదికలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
ప్రస్తుతం పెరుగుతున్న మెుండి బకాయిలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత ఆందోళనగా ఉంది. అయితే ఈ క్రమంలో మధ్య, చిన్న విలువ కలిగిన పర్సనల్ లోన్స్ పై ఎక్కువ నిఘా ఉంచాల్సిందిగా TransUnion CIBIL నివేదిక నొక్కి చెప్పింది. జనవరి 2022 నుంచి జూన్ 2023 మధ్య కాలంలో మెుత్తం రిటైల్ రుణాల్లో నాలుగింట ఒక వంతు చిన్న పర్సనల్ లోన్స్ ఉన్నాయని వెల్లడించింది. ఈ రుణాల్లో ఎక్కువ భాగం రూ.50,000 కంటే తక్కువ విలువైనవిగా పేర్కొనటం జరిగింది.

ఇదే క్రమంలో జూన్ 2023 త్రైమాసికంలో చిన్న పర్సనల్ లోన్స్ విభాగంలో కొత్త రుణాలు తీసుకున్న సగానికి పైగా కస్టమర్‌లు ఇప్పటికే నాలుగు రుణాలను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన నష్టాలను ప్రస్తావిస్తూ.. సెక్యూర్డ్ రుణాలపై మరింత శ్రద్ధ వహించాలని బ్యాంకులను కోరారు. ఇందులో భాగంగా రుణ సంస్థలు తమ అంతర్గత పర్యవేక్షణ మేకానిజమ్‌లను బలోపేతం చేయాలని సూచించారు. దీనివల్ల ఇబ్బందుల్లో పడకుండా ముందుగానే నియంత్రించవచ్చని సూచించారు.
పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్‌లు మినహా అన్ని రకాల రుణ డిఫాల్ట్‌లలో మెరుగుదల ఉన్నట్లు తాజా డేటా వెల్లడించింది. వ్యక్తిగత రుణాలలో డిఫాల్ట్ ఖాతాలు గత సంవత్సరం 0.44% నుంచి 0.84 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు 1.46% నుంచి 1.63%కి పెరిగాయి. అయితే ఆస్తి డిఫాల్ట్‌లపై రుణం మెరుగుపడి 3.19 శాతం నుంచి 2.18 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications