Banking News: నిబంధనలు పాటించడంలో విఫలమైన ఆర్థిక సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝళిపిస్తూ, తిరిగి గాడిన పెడుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల పేటీఎంపై పరిమితులు విధించింది. కాగా స్పీడ్ పెంచి ఏకంగా ఓ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.
మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నన జై ప్రకాష్ నారాయణ్ నగరి సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను RBI రద్దు చేసింది. డిపాజిటర్‌లకు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు దాని ప్రస్తుత ఆర్థిక స్థితి సరిపోకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకును మూసివేసి, లిక్విడేటర్‌ను నియమించడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా మహారాష్ట్రలోని సహకార కమిషనర్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరి 6న బ్యాంక్ వ్యాపార వేళల ముగిసిన అనంతరం RBI ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తమ డిపాజిట్లపై ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే నిబంధనల ప్రకారం ప్రతి ఖాతాదారుడి డిపాజిట్‌పై 5 లక్షల మేర DICGC ద్వారా ఇన్సూరెన్స్ ఉన్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం డిపాజిటర్లలో దాదాపు 99.78 శాతం మంది DICGC అందిస్తున్న ఇన్సూరెన్స్ డిపాజిట్ పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులుగా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సెప్టెంబరు 21, 2023 నాటికి సంబంధిత డిపాజిటర్ల అంగీకారంతో స్వీకరించిన మొత్తం ఆధారంగా బీమా చేసిన డిపాజిట్‌లలో DICGC ఇప్పటికే 23.89 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
జై ప్రకాష్ నారాయణ్ నగరి సహకార బ్యాంక్‌కు తగిన మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేకపోవడంతో చర్యలకు దిగాల్సి వచ్చినట్లు RBI పేర్కొంది. తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతిస్తే, ప్రజా ప్రయోజనాలకు అది ప్రతికూలంగా మారుతుంది అని వెల్లడించింది. అందుకే డిపాజిట్ల స్వీకరణ, విత్ డ్రా సహా ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించకుండా నిషేధం విధించింది.


Click it and Unblock the Notifications