G20 Summit: భారత్ అధ్యక్షతన న్యూదిల్లీలో జరుగుతున్న G20 సమావేశంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆధునిక ప్రపంచానికి కొంతమేర దూరంగా ఉంటూ వచ్చిన ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం లభించింది. ఈ ఘటనపై భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకులు సునీల్ భారతీ మిట్టల్ తనదైన శైలిలో స్పందించారు.
ఆఫ్రికన్ యూనియన్ ను G20లో శాశ్వత సభ్యునిగా చేర్చుకోవడాన్ని సునీల్ మిట్టల్ ప్రశంసించారు. ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. G20 రూపురేఖలను భారత్ పూర్తిగా మార్చేసిందన్నారు. ఇప్పటివరకు ఇలాంటి సమ్మిట్ చూడలేదనీ, భవిష్యత్తులోనూ జరగకపోవచ్చనీ అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా దేశాలకు రుణ ఉపశమనం, భారత్-ఆఫ్రికా సంబంధాలు, అక్కడి ఆర్థిక వృద్ధిపై ఆయన పలు విషయాలు మాట్లాడారు.

ఆఫ్రికాలో ఎయిర్ టెల్ 20 శాతం వృద్ధిని కనబరుస్తోందని మిట్టల్ తెలిపారు. మరో నాలుగేళ్లలో ఇదికాస్తా రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 15-20 ఏళ్ల క్రితం భారత్ ఉన్న చోట ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వనరులు సమృద్ధిగా ఉన్న ఆ దేశాలపై రుణభారాన్ని ఏవిధంగా మాఫీ చేయవచ్చో గ్లోబల్ లీడర్స్ చర్చించాలని సూచించారు.
ఇండియా మోడల్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI)ని ఆఫ్రికా ఉపయోగించుకోవాలని భారతీ ఎంటర్‌ప్రైజెస్ అధినేత కోరారు. దీనితో తమ పౌరులకు పలు ఆర్థిక, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు(DBT), ఆరోగ్యం సహా వివిధ ప్రభుత్వ సేవలు అందించడం సులభతరమవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో, అత్యంత సమర్థవంతమైన పాలన ప్రజలకు అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు.
ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహంలో గ్లోబల్ సౌత్‌కు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనను G20 అంగీకరించింది. తద్వారా గ్లోబల్ గ్రోత్ దృక్పథంలో ఆఫ్రికా వంటి పెద్ద ఖండాన్ని ఒంటరిగా వదిలిపెట్టబోమని భారత్ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించినట్లయింది. ఇందులో భాగంగా ఆఫ్రికన్ యూనియన్ కు ఇవాళ శాశ్వత సభ్యత్వం ఇచ్చింది.


Click it and Unblock the Notifications