RBI On CIBIL Score: రుణాలు పొందేందుకు చాలా కీలకమైనది సిబిల్ రిపోర్ట్. ఇందులోని స్కోర్ ఆధారంగా ఎంత రుణం ఇవ్వొచ్చు, ఎంత వడ్డీకి ఇవ్వొచ్చు వంటి విషయాలను రుణ సంస్థలు నిర్ణయిస్తుంటాయి. అయితే సిబిల్ స్కోర్ సంబంధించిన నిబంధనలను రిజర్వు బ్యాంక్ తాజాగా మార్చింది.
1. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఎవరైనా వ్యక్తి క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేసినప్పుడల్లా.. ఆ కస్టమర్‌కు సమాచారాన్ని పంపాల్సిన అవసరం ఉందని RBI అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని SMS లేదా ఈ-మెయిల్ ద్వారా పంపాలని సూచించింది. క్రెడిట్ స్కోరుపై అనేక ఫిర్యాదులు వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.

2. కస్టమర్ చేసిన ఏదైనా అభ్యర్థన తిరస్కరించబడితే.. దానికి కారణాన్ని అతనికి తెలియజేయాలని రిజర్వు బ్యాంక్ రుణ సంస్థలకు వెల్లడించింది. ఇది వారు ఎందుకు తిరస్కరించబడ్డారో సులువుగా తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. రుణ సంస్థలు సదరు వివరాలను వెంటనే అన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపటం ముఖ్యమని పేర్కొంది.
3. క్రెడిట్ కంపెనీలు ఏడాదికి ఒకసారి తమ కస్టమర్లకు పూర్తి క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా అందించాలని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఇందుకోసం తమ వెబ్‌సైట్‌లో లింక్‌ను ఉంచాలని చెప్పింది.
4. ఒక కస్టమర్ డిఫాల్ట్ చేయబోతున్నట్లయితే, డిఫాల్ట్ గురించి క్రెడిట్ బ్యూరోలకు నివేదించే ముందు కస్టమర్‌కు తెలియజేయడం చాలా ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రుణం అందించిన సంస్థలు ఎస్ఎమ్ఎస్ లేదా మెయిల్ ద్వారా ఈ వివరాలను కస్టమర్లకు అందించాలని సూచించింది. ఇవే కాకుండా బ్యాంకులు, రుణ వితరణ సంస్థలు నోడల్ అధికారులను నియమించాలి. క్రెడిట్ స్కోర్ సంబంధిత సమస్యల పరిష్కారానికి నోడల్ అధికారులు కృషి చేస్తారు.
5. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కస్టమర్ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే.. రోజుకు రూ.100 చొప్పున ఆలస్యమైన రోజులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఫిర్యాదు ఎంత ఆలస్యంగా పరిష్కారమైతే అంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం రుణం పంపిణీ చేసే సంస్థకు 21 రోజులు, క్రెడిట్ బ్యూరోకు 9 రోజులు గడువు లభిస్తుంది. 21 రోజుల్లోగా బ్యాంక్ క్రెడిట్ బ్యూరోకు తెలియజేయకపోతే, బ్యాంక్ పరిహారం చెల్లిస్తుంది. బ్యాంకు నుంచి సమాచారం అందిన 9 రోజుల తర్వాత కూడా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే.. క్రెడిట్ బ్యూరో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications