Digital Rupee: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటికి ఎలాంటి ప్రభుత్వ గ్యారెంటీ లేదు. ఆర్థిక వ్యవస్థలకు ఇవి ప్రమాదకారిగా మారటంతో పాటు, వినాశకరమైనవని ప్రభుత్వాలు వీటిపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత సెంట్రల్ బ్యాంక్ అధికారికంగా డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకొస్తోంది.
అయితే గతంలో డిజిటల్ రూపాయిని ముందుగా హోల్ సేల్ చెల్లింపుల విభాగంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన రిజర్వు బ్యాంక్ తాజాగా దీనిని రిటైల్ వినియోగానికి సైతం తీసుకురానుంది. ఇందుకోసం డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. దీనికోసం తొలిదశలో SBI, ICICI, YES bank, IDFC First ఈ లావాదేవీల్లో పాల్గొంటాయని తెలుస్తోంది.

ఈ చెల్లింపులను తొలుత కేవలం 4 నగరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. రెండవ దశలో వీటిని 9 నగరాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ రూపాయిలను రిజర్వు బ్యాంక్ నుంచి అనుమతి పొందిన బ్యాంకులు మాత్రమే అధికారికంగా డిజిటల్ రూపంలో పంపిణీ చేస్తాయి. వీటిని ఫోన్ వ్యాలెట్ లో స్టోర్ చేసుకుని వినియోగదారులు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. ఇవి ప్రస్తుతం ఉన్న ఫిజికల్ కరెన్సీ, నాణేల మాదిరిగానే పనిచేస్తుందని రిజర్వు బ్యాంక్ గతంలోనే వెల్లడించింది.
ఈ డిజిటల్ రూపాయిని వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా వ్యక్తి నుంచి వ్యాపారులకు చెల్లింపులు చేసేందుకు వినియోగించుకోవచ్చు. తొలిదశలో ముంబై, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో దీనిని ఆర్బీఐ ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతోంది.
రెండవ దశలో హైదరాబాద్, అహ్మదాబాద్, సిమ్లా, ఇండోర్, కోచి, గాంగ్‌టక్, లఖ్నో, గువహటి లలో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ క్రమంలో సేవలు అందించే బ్యాంకుల జాబితాలో BOB, Union bank, HDFC, Kotak Mahindra బ్యాంకులు వచ్చి చేరనున్నట్లు సమాచారం. భవిష్యత్తు డిజిటల్ చెల్లింపుల్లో రూపీ కీలకంగా మారనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications