Paytm: పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్.. డిపాజిట్స్, విత్‌డ్రాపై కీలక ఆదేశాలు.. ఆందోళనలో షేర్ హోల్డర్స్
RBI News: దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో ఫిన్‌టెక్‌ల పాత్ర ఎంతో ఉంది. ఈ విభాగంలో మేజర్ ప్లేయర్ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే పోటీదారులను తట్టుకుని నిలబడేందుకు ఇబ్బందులు పడుతున్న పేమెంట్స్ బ్యాంక్.. మరింత కష్టాల్లోకి కూరుకుపోయినట్లయింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆంక్షలు విధించింది. కొత్త డిపాజిట్లు స్వీకరించడం సహా ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించకూడదంటూ ప్రధాన వ్యాపార కార్యకలాపాలపై పరిమితులు పెట్టింది. ఈ మేరకు జనవరి 31న తన నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయకుండా ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని RBI నిషేధించింది.

సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక సహా బయటి ఆడిటర్స్ రిపోర్ట్ లోనూ పేటీఎం బ్యాంకు నిబంధనలు పాటించలేదని తేలినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మెటీరియల్ సూపర్‌వైజరీ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో తదుపరి చర్యలకు దిగింది. వన్97 కమ్యూనికేషన్స్, పేటీఎం నోడల్ ఖాతాలను వీలైనంత త్వరగా ముగించాలని కోరింది. పైప్‌లైన్ లోని లావాదేవీలను మార్చి 15లోగా సెటిల్ చేయాలని ఆదేశించింది.
ఫిబ్రవరి 29, 2024 తర్వాత కస్టమర్స్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లు మొదలైన వాటిలోకి డిపాజిట్లు, క్యాష్‌బ్యాక్‌లు లేదా క్రెడిట్ రీఫండ్‌లు అనుమతించబడవని స్పష్టం చేసింది. అయితే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాల్లో ఇప్పటికే ఉన్న నగదును ఎటువంటి పరిమితి లేకుండా కస్టమర్స్ ఉపసంహరించుకోవచ్చు లేదా వినియోగించుకోవచ్చని వెల్లడించింది.


Click it and Unblock the Notifications